kangana ranaut: కంగ‌నాతో వివాదంపై మొద‌టిసారి స్పందించిన హృతిక్‌

  • నిజాలు బ‌య‌ట‌పెట్ట‌డానికే మాట్లాడుతున్నా!
  • ఎంత వ‌దిలించుకుందామ‌న్నా ఈ వివాదం వ‌ద‌ల‌ట్లేదు
  • ద‌య‌చేసి దీన్ని ప్రేమ వ్య‌వ‌హారం అనొద్దు

రెండేళ్లుగా కంగనాకు, త‌న‌కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదంపై బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ మొద‌టిసారి త‌న నోరు విప్పాడు. ఈ వివాదం గురించిన విష‌యాలను తెలియ‌జేస్తూ హృతిక్ ఓ స్టేట్‌మెంట్ విడుద‌ల చేశాడు. వివాదం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు తాను మాట్లాడ‌క‌పోవ‌డంతో ఇది ఇంకా కొన‌సాగుతోందని, ఇప్పుడైనా మాట్లాడ‌క‌పోతే నిజానిజాల‌ను అపార్థం చేసుకునే అవ‌కాశం ఉండ‌టంతో తాను రంగంలోకి దిగిన‌ట్లు పేర్కొన్నారు.

`నేనెప్పుడూ సృజ‌నాత్మ‌క‌, నిర్మాణాత్మ‌క ప‌నులపైనే దృష్టి సారిస్తాను. అవి కాకుండా మిగ‌తా విష‌యాల‌ను ప‌ట్టించుకోను. అలా ప‌ట్టించుకోకుండా ఉండ‌టమే ఈ స‌మ‌స్య‌ను సృష్టించింది. కొన్నిసార్లు చిన్న అనారోగ్య‌మే పెద్ద జ‌బ్బుగా మారే అవ‌కాశం ఉంది. వీలైనంత త్వ‌ర‌గా దానికి చికిత్స చేయాలి. ఇప్పుడు ఈ స‌మ‌స్య నాకు పెద్ద జ‌బ్బుగా మారింది. ఒక‌వేళ ఈ విష‌యాన్ని నేను వ‌దిలేద్దామ‌నుకున్నా... మీడియా వ‌దిలేలా క‌నిపించ‌డం లేదు.

నాకు ఎలాంటి సంబంధంలేని విష‌యంలో నా స్వ‌భావాన్ని నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నా ప్ర‌మేయం లేకుండానే న‌న్ను ఈ వివాదంలోకి లాగారు. అస‌లు నిజం ఏంటంటే... నేను అస‌లు ఆ మ‌హిళను క‌ల‌వ‌నేలేదు. మేం ఇద్ద‌రం ఒకే సినిమాలో న‌టించి ఉండొచ్చు. కానీ వ్య‌క్తిగ‌తంగా మేమెప్పుడూ క‌లుసుకోలేదు. నేను మంచి వాడిన‌ని నిరూపించుకోవ‌డానికి ఇలా చెప్ప‌డం లేదు. న‌న్ను న‌మ్మండి. భ‌విష్య‌త్తులో ఈ వివాదం వ‌ల్ల క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికే ఇలా చెబుతున్నాను` అని హృతిక్ తెలియ‌జేశాడు.

ఇంకా ఆ స్టేట్‌మెంట్‌లో - `దుర‌దృష్ట‌వ‌శాత్తు నిజాన్ని తెలుసుకోవ‌డానికి కొంత‌మంది మాత్ర‌మే ఆస‌క్తి చూపుతున్నారు. `అమ్మాయిలు మంచి వాళ్లు.. మ‌గాళ్లదే త‌ప్పంతా` అనుకుంటూ అబ‌ద్ధాల‌ను న‌మ్మే వారితో నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. వారి ఆలోచ‌నలు కూడా నిజ‌మే. త‌రాల నుంచి ఆడ‌వాళ్లు వేధింపుల‌కు గుర‌వుతున్నారు. అంత‌మాత్రాన ఆడ‌వాళ్లు మంచివాళ్లు.. మ‌గాళ్లు చెడ్డ‌వాళ్లు అని స్ప‌ష్టంగా చెప్ప‌లేం. 2014లో పారిస్‌లో నిశ్చితార్థం జ‌రిగిన‌ట్టు ఫొటోషాప్ ద్వారా సృష్టించిన ఒక్క ఫొటో మిన‌హా ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ఆధారం లేదు. ఆ ఫొటో విడుద‌లైన మ‌రుస‌టి రోజే అది అబ‌ద్ధ‌మ‌ని నా శ్రేయోభిలాషులు, నా భార్య అర్థం చేసుకున్నారు.

2014లో నా పాస్‌పోర్టు వివ‌రాలు చూసుకోండి. ఆ మ‌ధ్య కాలంలో నేను ఎలాంటి ప్ర‌యాణాలు చేయ‌లేదు. ఈ విష‌యాలు నేను ముందే చెప్పి ఉండొచ్చు. కానీ ఆ మ‌హిళ‌ను కించ‌ప‌రచ‌డం ఇష్టం లేక మౌనంగా ఉన్నాను. ఇక ఈ-మెయిళ్లు ఎవ‌రు పంపార‌నే సంగ‌తి సైబ‌ర్ క్రైమ్ శాఖ తేల్చుతుంది. నేను నా ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌ను పోలీసుల‌కు ఇచ్చాను. మ‌రి అవ‌త‌లి వాళ్లు త‌మ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల‌ను పోలీసుల‌కు ఇవ్వ‌డానికి ఎందుకు నిరాక‌రిస్తున్నార‌నో అర్థం చేసుకోండి. మ‌రో ముఖ్య విష‌యం ... ఈ వివాదాన్ని ప్రేమ వ్య‌వ‌హారంగా మాత్రం చిత్రీక‌రించొద్దు. ఇప్ప‌టి వ‌ర‌కు దీని వ‌ల్ల నేను ఎదుర్కున్న స‌మ‌స్య‌లు చాలు. స‌మాజంలో ఆడ‌వాళ్ల మీద ఉన్న మంచి అభిప్రాయం కార‌ణంగా నేను బ‌లిప‌శువుగా మారాను. అలాగ‌ని నాకు కోపం లేదు. అస‌లు కోపం రాదు కూడా. కాక‌పోతే దీని వ‌ల్ల నా కుటుంబం, పిల్ల‌లు, స‌మాజం ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా` అని పేర్కొన్నాడు.

More Telugu News