forbes: 2017 'ఫోర్బ్స్' ధనవంతుల తాజా జాబితా విడుదల

  • తాజా బిలియనీర్ల జాబితా విడుదల
  • రూ. 2.48 లక్షల కోట్లకు ముఖేష్ సంపాదన
  • ఆసియాలో టాప్-5లో ఒకడిగా స్థానం
  • రెండో స్థానానికి ఎగబాకిన 'విప్రో' అజీం ప్రేమ్ జీ

2017 సంవత్సరానికి గాను ఇండియాలో బిలియనీర్ల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ 'ఫోర్బ్స్' ప్రకటించగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా పదో సంవత్సరంలోనూ టాప్-1 స్థానంలో నిలిచారు. ఇండియాలోని ధనవంతుల సంపద సరాసరిన 26 శాతం పెరిగిందని, స్టాక్ మార్కెట్లో వారి కంపెనీల ఈక్విటీ వాటాల విలువ పెరగడమే ఇందుకు కారణమని 'ఫోర్బ్స్' పేర్కొంది.

ముకేశ్ అంబానీ ఆస్తుల విలువ నికరంగా 38 బిలియన్ డాలర్లని తెలిపింది. ఆసియాలోని బిలియనీర్లలో ఈ సంవత్సరం అత్యధికంగా సంపదను పెంచుకున్నది ముఖేషేనని వెల్లడించింది. 2016లో ఆయన ఆస్తుల విలువ 22.7 బిలియన్ డాలర్లు కాగా, ఏడాదిలో ఆ మొత్తం 67 శాతం పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆసియాలోని టాప్-5 బిలియనీర్ల జాబితాలోకి చేరిపోయారని తెలియజేసింది.

ఇండియాలోని వంద మంది అత్యంత ధనవంతుల ఆస్తుల విలువ 479 బిలియన్ డాలర్లుగా 'ఫోర్బ్స్' లెక్కగట్టింది. గత సంవత్సరం ఈ మొత్తం 374 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. భారత వృద్ధి రేటు మందగమనంలో కొనసాగుతున్నప్పటికీ, ధనవంతుల ఆస్తులు మాత్రం భారీగానే పెరిగాయని వెల్లడించింది. ఇక గతేడాది నాలుగో స్థానంలో ఉన్న టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమజ్ జీ సైతం ఈ సంవత్సరం భారీగా తన ఆస్తిని పెంచుకున్నాడు. మొత్తం 19 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆయనిప్పుడు రెండో స్థానానికి ఎగబాకారు. ఆపై 18.4 బిలియన్ డాలర్లతో హిందుజా సోదరులు మూడవ స్థానంలో నిలిచారు.

ఇండియాలోని టాప్-10 ధనవంతుల జాబితా
1. ముకేశ్ అంబానీ: 38 బిలియన్ డాలర్లు - రూ. 2,48,102 కోట్లు
2. అజీమ్ ప్రేమ్‌ జీ: 19 బిలియన్ డాలర్లు - రూ. 1,24,051 కోట్లు
3. హిందుజా సోదరులు: 18.4 బిలియన్ డాలర్లు - రూ. 1,20,133 కోట్లు
4. లక్ష్మీ మిట్టల్: 16.5 బిలియన్ డాలర్లు - రూ. 1,07,728 కోట్లు
5. పల్లోంజి మిస్త్రీ: 16 బిలియన్ డాలర్లు - రూ. 1,04,464 కోట్లు
6. గోద్రేజ్ కుటుంబం: 14.2 బిలియన్ డాలర్లు - రూ. 92,711 కోట్లు
7. శివ్ నాడార్: 13.6 బిలియన్ డాలర్లు - రూ. 88,794 కోట్లు
8. కుమార బిర్లా: 12. 6 బిలియన్ డాలర్లు - రూ. 82,265 కోట్లు
9. దిలీప్ సంఘ్వీ: 12.1 బిలియన్ డాలర్లు - రూ. 79,000 కోట్లు
10. గౌతమ్ అదానీ: 11 బిలియన్ డాలర్లు - రూ. 71,819 కోట్లు

(ఒక డాలర్ రూపాయి మారకపు విలువ గురువారం నాటి ఆర్బీఐ రిఫరెన్స్ రేటు రూ. 65.29 ఆధారంగా)

More Telugu News