woman VAO: ఉద్యోగినిపై వేధింపులు.. గ్రామ కార్యదర్శిని ఈడ్చుకొచ్చి, చెప్పులతో కొట్టిన గ్రామస్తులు

  • మహిళా ఉద్యోగిపై గ్రామ కార్యదర్శి వేధింపులు
  • తాట తీసిన గ్రామస్తులు
  • ఒకరిపై మరొకరు కేసులు

తనతో పాటు పని చేస్తున్న మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్, గత కొంత కాలంగా కలచట్ల గ్రామ పంచాయతీ మహిళా కార్యదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో, ఆమెతో పాటు మరో 20 మంది గ్రామస్తులు ఒక్కసారిగా ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి చొరబడి... జనార్దన్ ను బయటకు ఈడ్చుకొచ్చారు. తోటి ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తిస్తావా? అని మండిపడుతూ, అతన్ని చెప్పులతో కొట్టారు.

ఇదే సమయంలో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. జనార్దన్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు, శాంతించని గ్రామస్తులు.... పోలీస్ స్టేషన్ కు చేరేవరకు అతనిపై దాడికి యత్నిస్తూనే ఉన్నారు. గత రెండు నెలలుగా సెల్ ఫోన్ లో అసభ్యకరమైన మెసేజ్ లను పంపుతూ, తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ... బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలాంటి మెసేజ్ లు పెట్టవద్దని తాను వేడుకున్నా, అతను మారలేదని ఆమె తెలిపింది. మరోవైపు, తనపై దాడి చేసిన వారిపై కూడా జనార్దన్ కేసు పెట్టాడు.

More Telugu News