Bhadrachalam: భద్రాద్రి రామయ్య పూజకు పూలు కరువు.. మూడు రోజులుగా మూర దండ కూడా లేకుండానే అర్చనలు!

  • చర్చనీయాంశంగా మారిన పుష్పాల కొరత
  • పూల కాంట్రాక్టర్‌దే తప్పంటున్న అధికారులు
  • మండిపడుతున్న భక్తులు

దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి పూజకు పుష్పాలు కరువయ్యాయి. ‘బంగారు పూలతో పూజ సేయరే’ అని పరమ భక్తుడైన నరసింహదాసు తన కీర్తనలతో స్వామి వారిని కీర్తిస్తే.. 'అసలు పువ్వులేవి రామచంద్రా!' అంటూ అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం స్వామి వారికి నిర్వహించిన నిత్య కల్యాణంలో సీతారామచంద్ర లక్షణస్వామి వార్లకు ఒక్క మూర దండ అయినా వేయకపోవడాన్ని చూస్తే పూల కొరత ఎంతగా వేధిస్తున్నదీ అర్థం చేసుకోవచ్చు. ఇక భద్రాద్రి ఆలయ అనుబంధ ఆలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏదో తూతూమంత్రంగా పూజ చేసి మమ అనిపిస్తున్నారు.

పూలు లేకుండా పూజలు నిర్వహిస్తుండడంపై భక్తులు మండిపడుతున్నారు. భద్రాద్రి ఆలయానికి ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా పుష్పాలు సైతం కొనలేని దుస్థితిలో అధికారులు ఉన్నారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే దేవస్థానం కాంట్రాక్టరు మూడు రోజులుగా పూలు సరఫరా చేయకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా మూడు రోజులుగా స్వామి వారికి పుష్పాలంకరణ లేకుండానే ఆలయ అర్చకులు పూజలు ముగించేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

More Telugu News