singuru: నిండిన సింగూరు, నిండుతున్న శ్రీశైలం, పొంగిన మూసీ నది!

  • పూర్తి స్థాయి నీటి మట్టానికి సింగూరు
  • దిగువకు 8 వేల క్యూసెక్కులు
  • నిండుకుండలా మూసీ జలాశయం..గేట్లన్నీ ఎత్తివేత
  • శ్రీశైలానికి 92 వేల క్యూసెక్కుల వరద
  • నాగార్జున సాగర్ కూ జలకళ

కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు మరింతగా పెరగగా, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సింగూరు నిండుకుండలా మారింది. 30 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న సింగూరు జలాశయంలో నీటి నిల్వ 29.50 టీఎంసీలను దాటగా, ఈ ఉదయానికి ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు, 11 గంటల సమయానికి 6 వేల క్యూసెక్కులకు పెరిగింది.

అప్పటికే విద్యుత్ ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించిన అధికారులు మొత్తం 8 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇక ఇవే వర్షాల ప్రభావంతో మూసీ నదిలో వరద ఉద్ధృతి పెరుగగా, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో 430 ఎకరాల పంటలు నీట మునిగాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బొప్పారం వద్ద ఉన్న మూసీ జలాశయం గేట్లన్నింటినీ ఎత్తి వేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కాగా, ఈ ఉదయం శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద 92 వేల క్యూసెక్కులుగా నమోదైంది. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న జలాశయంలో 188 టీఎంసీలకు నీరు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి, హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా 24 వేల క్యూసెక్కులను వదులుతున్నారు.

మరోవైపు నిన్నటి వరకూ బోసిపోయి కనిపించిన నాగార్జున సాగర్ జలాశయం, ఈ వర్షాలకు కాస్తంత జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 145 టీఎంసీలకు నీరు పెరిగిందని అధికారులు వెల్లడించారు. ఆల్మట్టికి 35 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, ఆ మొత్తాన్నీ దిగువకు వదులుతున్నారు.

More Telugu News