Indonesia: 23 అడుగుల కొండచిలువతో తలపడి, దానిని మట్టికరిపించి హీరో అయ్యాడు!

  • పైథాన్ తో తలపడిన ఇండోనేసియా వాసి
  • ఎడమచేయిని తీవ్రంగా గాయపరిచినా పట్టువదలని విక్రమార్కుడు
  • పైథాన్ ను హతమార్చిన రాబర్ట్ నబబన్
  • కొండచిలువను ఎక్కి ఉయ్యాలలూగుతున్న పిల్లలు

సాధారణంగా చిన్నపాము ఎదురైతేనే బెంబేలెత్తిపోయి పరుగులు తీస్తాం. అలాంటిది 23 అడుగుల కొండచిలువ ఎదురైతే... ఇంకేమన్నా ఉందా? ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాంటిది ఒక సెక్యూరిటీ గార్డు 23 అడుగుల కొండచిలువతో తలపడి ఇద్దరి ప్రాణాలు కాపాడి ఇంచుమించు ప్రాణాపాయ స్థితికి చేరిన ఘటన ఇండోనేసియాలో చోటుచేసుకుంది.

ఇండోనేసియా అడవుల్లో పెద్దపెద్ద కొండచిలువలు ఉంటాయి. ఆ దేశానికి చెందిన రాబర్ట్‌ నబబన్‌ (37) ఇంద్రగిరి హులు రీజియన్స్ ఆఫ్ రియావు ప్రావిన్స్‌ లో సెక్యూరిటీ విధులు పూర్తి చేసుకుని తన మోపెడ్ పై ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పామ్ ఆయిల్ తోటల మధ్యలోంచి వెళ్లే రోడ్డుపై ఆందోళనతో నిలబడిపోవడం గుర్తించాడు.

దీంతో ఏం జరిగిందా? అని చూసిన రాబర్ట్ కు వారిద్దరిపై దాడికి సిద్ధంగా ఉన్న 23 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. దానిని చూసిన రాబర్ట్, అది దాడికి సిద్ధంగా ఉండడంతో పారిపోయినా వదలదని గ్రహించి, దానితో యుద్ధానికి దిగాడు. ముందు దానిని ఒడిసిపట్టేద్దామని భావించాడు. ఈ ప్రయత్నంలో అది అతని చేతిని తీవ్రంగా గాయపరిచింది.

దీంతో దానితో ముష్టియుద్ధానికి దిగక తప్పలేదు. ఎలాగైతేనేమి దానిని రాబర్ట్ మట్టుబెట్టాడు. ఈ క్రమంలో అది అతని ఎడమచేయిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ కొండ చిలువను ఊర్లోకి తీసుకెళ్లి రెండు చెట్లకు కడితే... అక్కడి చిన్నపిల్లలు ఏమాత్రం భయం లేకుండా దానిపై ఉయ్యాల ఊగుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది మీడియాలో రావడంతో రాబర్ట్ హీరో అయ్యాడు. 

More Telugu News