breakfast: రోజులో మొద‌టి భోజ‌నం చాలా ముఖ్యం... అల్పాహారానికి ప్రాధాన్య‌త‌ ఇవ్వాలంటున్న శాస్త్రవేత్తలు!

  • బ్రేక్‌ఫాస్ట్ తీసుకోక‌పోతే అనారోగ్య సమస్యలు 
  • దీని వ‌ల్ల ధ‌మ‌నుల ప‌నితీరు మంద‌గిస్తుంది.
  • నిర్ల‌క్ష్యం వ‌ద్దంటున్న శాస్త్ర‌వేత్త‌లు

ఆఫీసుకు ఆల‌స్య‌మ‌వుతుంద‌నో, ఆయిల్ ఎక్కువ‌గా ఉంద‌నో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ చేయ‌కుండానే గ‌డిపేస్తుంటారు. మ‌రికొంత‌మందైతే లంచ్‌లో ఎక్కువ తినాల‌నే ఉద్దేశంతో పొద్దున్న ఏం తీసుకోరు. ఇలా రోజులో మొద‌టి భోజ‌నాన్ని నిర్ల‌క్ష్యం చేస్తే భ‌విష్య‌త్తులో తీవ్ర ఆరోగ్య సమ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని శాస్త్ర‌వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. అల్పాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల అథెరోస్క్లెరోసిస్‌ అనే అనారోగ్య సమస్య వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు.

దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ ధ‌మ‌నుల ప‌నితీరు మంద‌గిస్తుంది. అందుకే ఉద‌యం ప‌ది గంట‌ల‌లోగా ఏదో ఒకటి తినాల‌ని వారు సూచిస్తున్నారు. అలాగ‌ని స‌రైన పోష‌కాలు లేని ఆహారాన్ని తీసుకోవ‌ద్ద‌ని కూడా వారు చెబుతున్నారు.

అలాగే డిన్న‌ర్‌కి, లంచ్‌కు మధ్య, అంటే సాయంత్రం కూడా ఏదో ఒక అల్పాహారం తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని వారు చెబుతున్నారు. దీని వ‌ల్ల శరీరానికి స‌రైన పోష‌కాలు అంది, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఇంకా అల్పాహారం తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల శరీర బరువు దెబ్బతినడం, రక్తపోటు, గ్లూకోజ్‌ స్థాయులు పెరగ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయ‌ని మౌంట్‌ సినాయ్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

More Telugu News