Los vegas: రోజుకు 90 మంది ప్రాణాలు తీస్తున్న అమెరికా తుపాకులు!

  • ఈ ఏడాది ఇప్పటికే 12 వేల మంది మృతి 
  • గన్ కల్చర్‌పై దేశవ్యాప్తంగా ప్రారంభమైన చర్చ
  • తుపాకుల నియంత్రణకు చట్టం తేవాలని సూచన

అమెరికాలో తుపాకుల విష సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అగ్రరాజ్యంలో తుపాకులు గర్జిస్తున్నాయి. సగటున రోజుకు 90 మంది ప్రాణాలు తీస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే 12 వేల మంది వీటి రక్తదాహానికి బలయ్యారు. ఆదివారం రాత్రి లాస్‌వేగాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 59 మంది అసువులు బాశారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘గన్ వయెలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం గన్ కల్చర్‌ వల్ల పెరుగుతున్న అనర్థాలను వెల్లడించింది.

మరోవైపు దేశంలో తుపాకుల కారణంగా పెరుగుతున్న హింసపై దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. అమెరికా ప్రతినిధుల సభ తుపాకి సంస్కృతిపై విస్తృతంగా చర్చించింది. చర్చలో పాల్గొన్న ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు లాస్‌వేగాస్ ఘటనను తీవ్రంగా ఖండించారు. తుపాకుల నియంత్రణకు చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, లాస్‌వేగాస్ మారణహోమం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. కాల్పులు జరిపిన పాడ్డాక్ తమవాడేనని తెలిపింది. అయితే అందుకు ఎటువంటి ఆధారాలు చూపించలేదు.

 

More Telugu News