శంషాబాద్: శంషాబాద్ లో రెండో రన్ వే నిర్మాణ పనులు ప్రారంభించాలి: సీఎం కేసీఆర్

  • ఎయిర్ పోర్టు విస్తరణపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
  • మెట్రో రైలును ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించే యోచన
  • జీఎంఆర్, ఎల్ అండ్ టి, హెచ్ఎంఆర్ అధికారులతో త్వరలో సమావేశం 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండో రన్ వే నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. శంషాబాద్ విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టెర్మినల్ ను విస్తరించాలని, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజుకు 400 విమానాల రాకపోకలు జరుగుతున్నాయని, ఈ ఎయిర్ పోర్టు ద్వారా ఏడాదికి 1.70 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు.

మెట్రో రైలును ఎయిర్ పోర్ట్ వరకు విస్తరించాలని, త్వరలో జీఎంఆర్, ఎల్ అండ్ టి, హెచ్ఎంఆర్ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. 12 వేల సీటింగ్ కెపాసిటీతో ఓ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్మించాలని పేర్కొన్న కేసీఆర్, ఎయిర్ పోర్టు సిటీ శంకుస్థాపనకు హాజరవుతానని చెప్పారు. కాగా, సీఎం కేసీఆర్ ని  జీఎమ్మార్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు ఈ రోజు కలిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఆదాయంలో తెలంగాణ ప్రభుత్వ వాటా రూ.12.28 కోట్ల చెక్కును కేసీఆర్ కు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించుకున్నట్టు సమాచారం.

More Telugu News