ras al khaima: భారతీయుడి ప్రాణాలను కాపాడటానికి.. ఎవరూ చేయలేని పని చేసిన ముస్లిం యువతి!

  • రస్ అల్ ఖైమాలో ఘటన
  • ప్రమాదానికి గురైన రెండు ట్రక్కులు
  • మంటల్లో చిక్కుకున్న భారతీయ డ్రైవర్
  • క్షణం కూడా ఆలోచించకుండా అతన్ని కాపాడేందుకు యత్నించిన ముస్లిం యువతి

ఓ భారతీయుడిని కాపాడిన ముస్లిం యువతిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని జవహర్ సైఫ్ అల్ కుమైటీ (22) అనే ముస్లిం యువతి ఒక ఫ్రెండ్ ను హాస్పిటల్ లో పరామర్శించి కారులో తిరిగి ఇంటికి వెళుతోంది. ఈ క్రమంలో, రోడ్డుపై తగలబడుతున్న రెండు ట్రక్కులను ఆమె చూసింది. ఇదే సమయంలో కాపాడాలంటూ ఓ బాధితుడు చేస్తున్న ఆర్తనాదాలు ఆమె చెవినబడ్డాయి. ఆ ఆర్తనాదాలు ఎవరివో కాదు... భారతీయుడైన హర్ కిరీట్ సింగ్ అనే డ్రైవర్ వి.

ట్రక్కులు తగలబడిపోతున్న అలాంటి తరుణంలో, మరొకరైతే సాయం చేసేందుకు ముందూ వెనకా ఆలోచించేవారేమో. కానీ, కుమైటీ మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. కారులోనే ఉన్న తన స్నేహితురాలు ధరించిన దుస్తులను తీసుకుని, ఆమెను కారులోనే కూర్చోమని చెప్పింది. వెంటనే కారు నుంచి బయటకు వచ్చి... ఆ దుస్తులతో కిరీట్ కు అంటుకున్న మంటలను ఆర్పివేసింది. ఆ తర్వాత కాసేపటికి అంబులెన్స్ వచ్చింది. అతనికి ప్రథమ చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, "అతను కింద పడిపోయాడు. మంటల్లో చిక్కుకున్నాడు. ఆ సమయంలో నా స్నేహితురాలి దుస్తులు తీసుకుని, ఆమెను కారులోనే ఉండమని చెప్పా. అప్పటికే అతని దుస్తులన్నీ కాలిపోయాయి. అతను బాధలో ఉన్నాడు. నేను చనిపోతున్నా... నాకు చావాలంటే భయంగా ఉంది అంటూ నాతో చెప్పాడు. నేను అతనికి ధైర్యం చెప్పా. నీవు బతుకుతావు అంటూ ధైర్యాన్ని కలిగించా. ఆ సమయంలో నాకు అతని ప్రాణాలను కాపాడాలనే ఆలోచన మాత్రమే ఉంది" అని తెలిపింది. 40 నుంచి 50 శాతం గాయాలతో ఉన్న కిరీట్ కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతను ప్రాణాలతో క్షేమంగా ఉన్నాడు.

ఈ సందర్భంగా కుమైటీ మాట్లాడుతూ, మనిషి ప్రాణాలను కాపాడగలిగేంత ధైర్యాన్ని తనకు ప్రసాదించిన అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పింది. సరైన సమయంలో స్పందించడం వల్లే అతని ప్రాణాలను కాపాడగలిగామని తెలిపింది. మరోవైపు, తోటి మనిషి ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా వ్యవహరించిన కుమైటీని సగౌరవంగా సన్మానిస్తామని మేజర్ తారిక్ మొహమ్మద్ అల్ షర్హాన్ తెలిపారు. అబుదాబిలో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా కుమైటీనీ సన్మానించాలని నిర్ణయించింది.

More Telugu News