కెన‌డా జాతీయ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన భార‌తీయ సిక్కు

02-10-2017 Mon 12:21
  • న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ నాయ‌కుడిగా ఎన్నికైన జగ్మీత్ సింగ్‌
  • అత్య‌ధిక మెజార్టీతో గెల్చిన సింగ్‌
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానిగా పోటీ
కెన‌డాలో ఉన్న మూడు ప్ర‌ముఖ జాతీయ పార్టీల్లో ఒక దానికి నాయ‌కుడిగా ఎన్నికై భార‌తీయ సిక్కు జ‌గ్మీత్ సింగ్ రికార్డు సృష్టించారు. ఈ ప‌ద‌వికి ఎన్నికైన మొద‌టి భార‌తీయుడిగా, మొద‌టి సిక్కుగా, కెన‌డాలోని మైనార్టీ వ‌ర్గానికి చెందిన మొద‌టి వ్య‌క్తిగా ఆయ‌న నిలిచారు. న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ (ఎన్డీపీ) నాయ‌కత్వం కోసం జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ్మీత్ సింగ్ సునాయాసంగా గెలిచారు. మొత్తం 66,000ల‌ ఓట్లు పోల‌వ‌గా జ‌గ్మీత్ 35,000ల‌ ఓట్లు గెల్చుకున్నారు.

 2019లో జ‌ర‌గ‌నున్న ఫెడ‌ర‌ల్ ఎన్నిక‌ల్లో ఎన్డీపీ బాధ్య‌త‌ల‌ను జ‌గ్మీత్ చూసుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగిస్తూ - `ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకునే ప్ర‌భుత్వం కెన‌డియ‌న్ల‌కు కావాలి. వారికోసం పాటుప‌డే ప్ర‌భుత్వాన్ని నెల‌కొల్పే ఉద్దేశంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రధాని పదవి కోసం ప్ర‌చారాన్ని ప్రారంభిస్తున్నాను` అన్నారు. `ప్రేమ‌, ధైర్యం` అనే ఇతివృత్తంతో జ‌గ్మీత్ సింగ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించారు.