south Korea: కిమ్ జాంగ్ ఉన్ ను హతమార్చేందుకు అమెరికా ప్రణాళిక?

  • యుద్ధం కంటే కిమ్ ను చంపడమే మేలంటున్న అమెరికా
  • కిమ్ వ్యతిరేకుల సాయంతో అమెరికా బలగాల ఆపరేషన్
  • అణుయుద్ధాన్ని నివారించాలంటే కిమ్ హత్య ఒక్కటే మార్గం అంటున్న అమెరికా

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ హత్యకు అమెరికా వ్యూహాలు రచిస్తోందా?...అణ్వాయుధ పరీక్షలు, మూడో ప్రపంచయుద్ధం ఆపాలంటే కిమ్ జాంగ్ ఉన్ ను చంపడమే మార్గమని అగ్రరాజ్యం భావిస్తోందా? అంటే డెయిలీ స్టార్ పత్రిక వెల్లడించిన వివరాలు అవుననే సమాధానమిస్తున్నాయి. అమెరికాతో చర్చలకు కిమ్ విముఖంగా ఉండడానికి తోడు, యుద్ధానికే మొగ్గుచూపుతూ సైనిక బలగాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఇక ఉపేక్షించేందుకు ఇది సమయం కాదని అమెరికా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆయనను హతమార్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు ఆయనను హతమార్చేందుకు అమెరికా రహస్య సాయుధ సేవల బలగాలు, యూఎస్‌ డెల్టా ఫోర్స్‌, దక్షిణ కొరియా కమాండో కలసి ఒక యూనిట్‌ గా ఏర్పడనున్నట్టు తెలుస్తోంది.

అమెరికా తరవాత కిమ్ టార్గెట్ దక్షిణ కొరియా అన్న సంగతి విదితమే. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ పై ఎలెక్ట్రోమేగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ)తో దాడిచేసి ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కిమ్ వ్యూహాలు రచిస్తున్నాడని, ఇది జరగకముందే అతనిని హతమార్చాలని అమెరికా భావిస్తోంది. గగన, ఉపరితల, జల మార్గాల ద్వారా ఏకకాలంలో కిమ్‌ ప్యాలెస్‌ పై దాడి చేసి అతనిని అంతమొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

ఉత్తర కొరియాలోనే రక్షణ విధులు నిర్వహిస్తూ కిమ్‌ తీరు నచ్చని వారి సహాయంతో ఆపరేషన్ అమలు చేయాలని అమెరికా భావిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్. మూడో ప్రపంచ యుద్ధానికి ఇది కారణం కూడా అవుతుందని బ్రిటన్‌ ఇంటెలిజెన్స్‌ సీనియర్‌ అధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అణుయుద్ధంకంటే ఇది మంచి ప్రత్యామ్నాయం అని ఆయన దీనిని సమర్థించడం విశేషం.

 దీని ద్వారా సంభవించే పరిణామాలు ఇంగ్లండ్ పై కూడా తీవ్రప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా కిమ్ ను హతమారిస్తే, అంతర్జాతీయ న్యాయస్థానంలో చిక్కులు వచ్చిపడతాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు కిమ్ ను పదవీచ్యుతుడిని చేసి, మరొక వ్యక్తిని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టాలంటూ చేసిన ఒత్తిడిని చైనా తొసిపుచ్చిందని, దీంతో తమ ముందు మరో మార్గం లేదని అమెరికా భద్రతాబలగాలు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది.

ఈ వ్యూహం విజయవంతమయ్యేందుకు కేవలం 40 శాతం అవకాశముందని, 60 శాతం విఫలమయ్యే అవకాశం ఉందని, రిస్క్ అనుకోకుండా ఆపరేషన్ విజయవంతం చేస్తే, అణుయుద్ధం కంటే ఇదే మంచిదని పలువురు పేర్కొంటున్నారు. 

More Telugu News