sisters: కష్టాలంటే ఇవే... 100 కిలోమీటర్ల దూరం బండిని లాగిన అక్కాచెల్లెళ్లు!

  • చెల్లెలి కోసం భాగ్ పట్ నుంచి హరిద్వార్ వెళ్లిన అక్కాచెల్లెళ్లు
  • చెల్లెలిని అపహరించిన సాధువు గుర్తింపు 
  • బండి లాక్కుంటూ స్వగ్రామానికి బయల్దేరిన వైనం 

ఉత్తరప్రదేశ్ మీడియాలో వెలుగు చూసిన ఒక కథనం అందర్నీ ఆవేదనకు గురి చేస్తోంది. దాని వివరాల్లోకి వెళ్తే... భాగ్ పట్ జిల్లా నెవెడాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కైరునా (12) కు మాయమాటలు చెప్పిన సాధువు గత ఆగస్టులో ఆమెను హరిద్వార్‌ తీసుకెళ్లాడు. వారి తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. వారి తండ్రి అంధుడు. దీంతో చెల్లెలిని వెతికే బాధ్యతను మిగిలిన ముగ్గురు తీసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోలేదు. దీంతో తమ చెల్లెలిని తామే వెతకాలని నిర్ణయించుకున్నారు.

సాధువు గురించి ఆరాతీసి ఇంటి నుంచి బయల్దేరారు. చేతిలో ఉన్న కాస్త డబ్బుతో ఒక గుర్రం పిల్లను కొనుగోలు చేశారు. 15 రోజుల క్రితం హరిద్వార్ చేరి సాధువును వెతికారు. వీరు అక్కడికి వచ్చారన్న విషయం తెలుసుకున్న సాధువు పరారయ్యాడు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితం లేకుండా పోయింది. ఇంతలో వీరి గుర్రం పిల్లను ఎవరో దొంగిలించారు. చేతిలో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతుండడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. దీంతో తండ్రిని బండిపై వేసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. బండిని లాగడానికి అందరికన్నా పెద్దదైన మీనా సిద్ధపడగా, చెల్లెలు షకీలా ఆమెకు సాయపడింది.

 తమ్ముడితో కబుర్లు చెబుతూ అక్కాచెళ్లెళ్లు సుమారు వంద కిలోమీటర్ల దూరం బండిలాగారు. షామిలీ గ్రామానికి చేరిన వీరిని స్థానికులు ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో విషయం కాస్తా మీడియా కంటబడి అధికారులకు తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు వారిని కలుసుకున్నారు.

వారికి ఒక గుర్రాన్ని ఇప్పించారు. తిరిగి ఇంటికెళ్లే దాకా తిండితిప్పలకు కావలసిన డబ్బులిచ్చారు. స్థానిక వైద్యుడితో పరీక్షలు నిర్వహించారు. స్థానికుడు ఒకరు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు బూట్లు కొనిచ్చాడు. ఆ అధికారులు భాగ్‌ పట్‌ జిల్లా అధికారులకు ఫోన్‌ చేసి, తక్షణం కైరునా ఆచూకీ కనుగొనాల్సిందిగా సూచించారు. వారి వ్యథ చాలామందిని కదిలించింది. సోషల్ మీడియాలో వారిపై సానుభూతి వ్యక్తమవుతోంది. 

More Telugu News