Indian railways: ప్రధాని మోదీపై న్యాయపోరాటం ప్రారంభించిన ఇద్దరు విద్యార్థినులు!

  • రైల్వే వ్యవస్థను ఆధునికీకరించకుండా బుల్లెట్ రైలు తీసుకురావడం అవసరమా?
  • న్యాయపోరాటం ప్రారంభించిన శ్రేయ చవాన్, తన్వి మహాపంకర్
  • 24 గంటల్లో 4,327 సంతకాలు సేకరించిన శ్రేయ, తన్వి

ప్రధాని నరేంద్ర మోదీపై ఇద్దరు విద్యార్థినులు న్యాయ పోరాటం ప్రారంభించారు. ముంబైలోని ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వేస్టేషన్‌ లో తొక్కిసలాట జరగడంతో రైల్వే శాఖ ఉదాసీనత మరోసారి అందరికీ తెలిసింది. దీంతో రైల్వే శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులు...ముంబై లోకల్ రైల్వే వ్యవస్థను ఆధునికీకరించకుండా బుల్లెట్ రైలు ప్రాజెక్టు తీసుకురావడంపై పోరాటం ప్రారంభించారు.

శ్రేయ చవాన్ (17), తన్వి మహాపంకర్ (17) లు ప్రధానిపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేవలం 24 గంటల్లోనే 4,327 సంతకాలను సేకరించారు. వారు వేసిన పిటిషన్‌ లో ప్రధాని మోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్లను చేర్చారు. ముంబైలో రోజూ చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాల్లో కనీసం 9 మంది చనిపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై లోకల్ రైల్వే వ్యవస్థను బాగు చెయ్యకుండా, బుల్లెట్ రైళ్లను తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట చోటుచేసుకుందని వారు తెలిపారు. కాగా, ముంబై - అహ్మదాబాద్ నగరాల మధ్య 508 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి ఇటీవలే జపాన్ ప్రధాని షింజోతో కలిసి మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రైలులో పేదలు ప్రయాణించగలరా? పేద, సాధారణ ప్రజలు ప్రయాణించలేని రైలుకు అంత వ్యయం చేయాల్సిన అవసరం ఉందా? అని పలువురు నిలదీస్తున్నారు. 

More Telugu News