అభివృద్ధి గురించి అడిగిన వ్యక్తిని చావబాదిన మేఘాలయ ఎమ్మెల్యే.. తీవ్రగాయాలు!

02-10-2017 Mon 07:06
  • అందరిముందు నిలదీయడంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే
  • దాడిచేసి పిడిగుద్దులు కురిపించిన వైనం
  • ఆసుపత్రిలో బాధితుడు
నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రశ్నించిన ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే అందరూ చూస్తుండగానే దాడిచేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మేఘాలయలో జరిగిందీ ఘటన. ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సౌత్ గారో హిల్స్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు శామ్యూల్ సంగ్మాను స్థానిక వ్యక్తి ఫ్రీడమ్ మారక్ అభివృద్ధిపై నిలదీశాడు. సిటీని అభివృద్ధి చేస్తానని గతంలో హామీ ఇచ్చారని, మచ్చుకైనా అది కనిపించడం లేదని పదిమందిలో నిలదీశాడు. అందరిముందు తనను నిలదీయడంతో తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే మారక్‌పై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారు. అతడి దాడితో మారక్ ముఖం ఉబ్బిపోయింది. కళ్లు బైర్లు కమ్మాయి.  తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఎమ్మెల్యే దాడిలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. దీంతో అతడు వెళ్లి శాసనసభ్యుడిపై కేసు పెట్టాడు.

ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన వ్యక్తి నుంచి ఫిర్యాదు అందుకున్నట్టు సౌత్ గారో హిల్స్ ఎస్పీ అబ్రహం టి.సంగ్మా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధితుడిని వైద్య పరీక్షలకు  పంపినట్టు ఆయన తెలిపారు.
శామ్యూల్ బఘ్‌మర నియోజకవర్గం నుంచి 2013లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అధికార కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే దాడిచేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడిచేసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి.