maa: మా వాళ్లవి అద్దాల మేడల బతుకులు... ఒక్క రాయితో పగిలిపోతాయి: నటుడు మురళీమోహన్

  • మీడియా అత్యుత్సాహం తగదు
  • ఒకటికి పదిసార్లు చూపే ముందు ఆలోచించండి
  • ఓ వెబ్ సైట్ పై చట్టపరమైన చర్యలు
  • నటుడు మురళీమోహన్ వెల్లడి

సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ల జీవితాలు అద్దాల మేడల వంటివని, ఒక్క రాయి వేయగానే పగిలిపోతాయని సీనియర్ నటుడు, తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఏర్పాటై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజాతో కలసి మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్, సినీ ప్రముఖుల విషయంలో మీడియా ఎంతో అత్యుత్సాహాన్ని చూపిస్తుంటుందని ఆరోపించారు.

సినిమాలకు సంబంధించిన వాళ్లు ఏదైనా ఘటనలో ఇరుక్కుంటే ఒకటికి పది సార్లు మీడియా చూపిస్తుంటుందని, ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. మీడియా కూడా ఓసారి ఆలోచించాలని సూచించారు. ఇటీవలి కాలంలో ఓ వెబ్ సైట్ లో సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, తెలుగు చిత్ర పరిశ్రమలోని వారంతా పాల్గొంటారని తెలిపారు. కళాకారులకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రన్న బీమా, కేసీఆర్ బీమాతో పాలసీలు ఇవ్వనున్నారని, కేవలం రూ. 15 చెల్లించి ఈ పాలసీలను సినీ కార్మికులు పొందవచ్చని మురళీమోహన్ తెలిపారు.

More Telugu News