seat belt: సీట్ బెల్ట్ లేకుండా కారులో వచ్చిన ఉద్యోగినిని వినూత్నంగా శిక్షించిన బాస్... మరీ ఇలానా? అంటున్న నెటిజన్లు!

  • గోడకు ఆనుకుని నిలబడాలని శిక్ష
  • కదలకుండా ప్లాస్టర్లు వేసిన వైనం
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదమని, కారులో సీట్ బెల్ట్ కచ్చితంగా పెట్టుకోవాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా మన దేశంలో నిబంధనలు పాటించే వాళ్ల కన్నా, అతిక్రమించే వాళ్లే అధికంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియాకన్నా అధికంగా జనాభా ఉండే చైనాలోనూ ప్రజలు ఇలాగే నిబంధనలను పక్కన పెడుతుంటారు. బీజింగ్ లో తన కింద పనిచేసే ఉద్యోగిని కారులో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఆఫీసుకు వచ్చిందని ఆరోపిస్తూ, ఆమెకు వినూత్నంగా శిక్ష వేయగా, ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. బాస్ వేసిన శిక్షను కొందరు మెచ్చుకుంటుండగా, మరీ ఇలా ప్రవర్తించాలా? అని విమర్శిస్తున్న వాళ్లూ లేకపోలేదు.

లోపలికి వచ్చి కూర్చున్న సదరు ఉద్యోగిని, రోజు మాదిరిగానే విధుల్లో మునిగిపోగా, బాస్ రమ్మంటున్నారన్న కబురు వచ్చింది. ఎందుకు పిలిచారోనని లోనికి వెళ్లిన ఆమెకు, కారులో సీట్ బెల్ట్ లేకుండా వచ్చిన సీసీటీవీ రికార్డును చూపించి, శిక్ష తప్పదని చెబుతూ, ఆదేశాలు ఇచ్చేశారు. రోజంతా గోడకు ఆనుకుని నిలుచోవాలని శిక్ష వేశారు. అటూ ఇటూ కదలడానికి వీల్లేదంటూ ఆర్డర్ ఇచ్చారు. అంతేనా... ఆమెను గోడకు నిలుచోబెట్టి కదలకుండా ప్లాస్టర్లు వేశారు. ఆఫీసు సమయం వరకూ ఆమె అలాగే నిలుచోవాల్సి వచ్చింది. ఆ ఫోటోలను మీరూ చూడవచ్చు.
 

More Telugu News