nellore: ఈ ఏటి స్పెషల్: 'స్పైడర్', 'జై లవకుశ' రొట్టెలు... కావాలంటే నెల్లూరు వెళ్లాల్సిందే!

  • బారా షహీద్ దర్గాలో మొదలైన రొట్టెల పండగ
  • నాలుగు రోజుల పాటు సాగనున్న పండగ
  • 18 లక్షల మంది హాజరయ్యే అవకాశం
  • ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు

నెల్లూరు నగరంలో ప్రసిద్ధి చెందిన బారా షహీద్ దర్గాలో రొట్టెల పండగ వైభవంగా మొదలైంది. ఈ దఫా ఇటీవలి హిట్ చిత్రాలు 'స్పైడర్', 'జై లవకుశ' రొట్టెలు తొలిరోజున చేతులు మారుతున్నాయి. మామూలు రొట్టెల సైజుతో పోలిస్తే ఇవి విభిన్నంగా కనిపిస్తున్నాయి. రొట్టెల పండగ సందర్భంగా భక్తులు తమ కోరికలు నెరవేరడానికి రొట్టెలను కొనుగోలు చేసి, అదే కోరికను అప్పటికే తీర్చుకున్న వారితో వాటిని మార్పిడి చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. మొహర్రం నెల మొదటి రోజు నుంచి దర్గాలో నాలుగు రోజుల పాటు రొట్టెల పండగ జరుగనుండగా, ఈ సంవత్సరం సుమారు 18 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.

గత సంవత్సరం విశేషంగా ఆకర్షించిన 'బాహుబలి' రొట్టెలు, 'అమరావతి' రొట్టెలు ఈ సంవత్సరం కూడా సందడి చేస్తున్నాయి. సాధారణంగా కనిపించే వివాహ రొట్టె, సంతానం రొట్టె, సౌభాగ్యం రొట్టె, విద్యా రొట్టె, వీసా రొట్టె వంటి కౌంటర్ల వద్ద రద్దీ అధికంగా కనిపిస్తోంది. పండగ చరిత్రను చెప్పేలా దర్గా పక్కనే ఉన్న చెరువులో ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.

 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలుగకుండా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. చెరువు గట్టుపై జల్లుస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని వెల్లడించారు. నెల్లూరు నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్టు తెలిపారు.

More Telugu News