srisailam: శ్రీశైలానికి భారీ వరద... పదడుగులు నిండితే చాలిక!

  • 875 అడుగులు దాటిన నీటిమట్టం
  • 164 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
  • పూర్తి స్థాయి విద్యుత్ తయారీ జరుగుతోంది
  • దిగువకు 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్న అధికారులు

గత రెండు రోజులుగా కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 875 అడుగుల వరకూ నీరు చేరుకుంది. మరో పది అడుగుల మేరకు నీరు వస్తే, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం ప్రాజెక్టులోకి వచ్చిన నీరు 1,27,824 క్యూసెక్కులుగా నమోదైందని తెలిపారు.

వస్తున్న నీటిలో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపు 50 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నామని తెలిపారు. పోతిరెడ్డి పాడు ఎత్తిపోతల ద్వారా 12 వేల క్యూసెక్కులను, హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామన్నారు. కాగా, మొత్తం 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 164 టీఎంసీల నీరు ఉంది.

మరోవైపు నాగార్జున సాగర్ జలాశయానికి 55 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువన ఉన్న ఆల్మట్టికి 43 వేల క్యూసెక్కులు, జూరాలకు 63 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులూ గత నెలలోనే పూర్తిగా నిండిన సంగతి తెలిసిందే.

More Telugu News