Hafiz Saeed: పాకిస్థాన్ మంత్రిపై కేసు వేసిన ఉగ్రనేత హఫీజ్ సయీద్.. వైన్ తాగుతాడని అనడమే కారణం!

  • మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఉగ్రవాది
  • రూ.పదికోట్లకు పరువునష్టం దావా
  • మంత్రి వ్యాఖ్యలతో సయీద్ షాకయ్యారన్న న్యాయవాది

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రనేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రిపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేశాడు. పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్ ఇటీవల న్యూయార్క్‌లో నిర్వహించిన ఆసియా సొసైటీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సయీద్, హక్కానీలు, లష్కరే తాయిబా ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చాలా కావాల్సిన వారని, వారిని వదిలించుకోవడానికి తగిన కారణాలు లేవని అన్నారు. పాక్‌లో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయాలని అమెరికా ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చిందని, 20-30 ఏళ్ల క్రితం అమెరికా వారిని ‘డార్లింగ్’ (కావాల్సినవారు)గా పరిగణించిందని అన్నారు.

మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన సయాద్ తన న్యాయవాది ఏకే దోగార్‌తో మంత్రికి నోటీసులు పంపాడు. ఈ సందర్భంగా దోగార్ మాట్లాడుతూ జమాత్-ఉద్- దవా (జేయూడీ) చీఫ్ అయిన సయాద్ ముస్లిం ఆచార వ్యవహారాలను తు.చ.తప్పకుండా పాటిస్తారని, ఆయన ఎప్పుడూ వైట్ హౌస్ దగ్గర్లో లేరని, వైన్ తాగారని, భోజనం చేశారని ఆయన మాట్లాడడం తగదని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి తన క్లయింట్‌ను వైన్ తీసుకుంటారని అనడంతో ఆయన షాక్‌కు గురయ్యారని దోగార్ పేర్కొన్నారు.

ఇస్లాం దేశభక్తుడైన హఫీజ్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పాకిస్థాన్ పీనల్ కోడ్‌లోని 500 సెక్షన్ కింద శిక్షార్హమని అన్నారు. ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు. మంత్రి వ్యాఖ్యలతో సయీద్ పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని, అందుకే పరువునష్టం దావా వేసినట్టు దోగార్ తెలిపారు.

More Telugu News