banni utsavam: ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వని పోలీసుల చర్యలు... దేవరగట్టులో చిందిన రక్తం!

  • మాల మల్లేశ్వరుని విగ్రహాల కోసం పోటీపడ్డ 11 గ్రామాల ప్రజలు
  • 31 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
  • ఉత్సవం ప్రశాంతంగా జరిగిందన్న పోలీసులు 

కర్నూలు జిల్లా కోలగట్టు మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎప్పటిలానే రక్తం చిందింది. మాల మల్లేశ్వరుడిని దక్కించుకునేందుకు పదకొండు గ్రామాల ప్రజలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ పోటీ పడగా, 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని, నలుగురి పరిస్థితి కాస్త విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

ప్రతియేటా జరిగే బన్ని ఉత్సవంలో భాగంగా, స్వామివారిని దక్కించుకునేందుకు ప్రజలు సంప్రదాయం పేరిట పిడకలు, కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం రక్తపాతం జరగకుండా చూసేందుకు ముందుగానే కర్రలను స్వాధీనం చేసుకుని 500 మందిపై బైండోవర్ కేసులు పెట్టి, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా, పోలీసుల చర్యలు ఎంతమాత్రమూ ఫలితాలను ఇవ్వలేదు.

దసరా రోజున మాల మల్లేశ్వరుని కల్యాణం తరువాత సింహాసనం గట్ట, రాక్షస పడ, జమ్మిచెట్టు, నేదురు బసవన్న గుడుల మీదుగా స్వామిని ఊరేగించారు. ఉత్సవ విగ్రహాలు కొండ దిగి రాగానే పదకొండు గ్రామాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన భక్తులు, ప్రజలు కర్రలు తీసుకుని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. సంప్రదాయం పేరుతో ఈ పోరు జరిగినప్పటికీ, ఎప్పటిలానే పలువురి తలలు పగిలాయి. కాగా, ఈ సంవత్సరం బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించామని, వచ్చే సంవత్సరం మరిన్ని చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News