google: హత్య కేసు నుంచి యువకుడిని నిర్దోషిగా బయటపడేసిన ‘గూగుల్’!

  • ఉద్దేశపూర్వకంగా యువకుడిపై హత్యకేసు
  • బలమైన సాక్ష్యంగా నిలిచిన గూగుల్ ఐపీ అడ్రస్
  • విచారణాధికారిపై చర్యలకు కోర్టు ఆదేశం

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కాలేజీ విద్యార్థి ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సాయంతో నిర్దోషిగా బయటపడ్డాడు. 11 ఏళ్ల చిన్నారి హత్య కేసులో జై ప్రతాప్ సింగ్ అలియాస్ మోహిత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని గూగుల్ సాయంతో నిరూపించి బయటపడ్డాడు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ కేసును విచారించిన విచారణాధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రెహాన్ అనే 11 ఏళ్ల చిన్నారి హత్యకేసులో భారత వాయుసేన అధికారి కుమారుడైన జై ప్రతాప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 20, 2016న సాయంత్రం 6:30 గంటలకు రెహాన్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత రెండు గంటలకు రెహాన్ మృతదేహం లభ్యమైంది. దుండగులు బాలుడి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.

ఈ హత్యతో జైకు ఎటువంటి సంబంధం లేదని నిరూపించే సాక్ష్యాధారాలను జై తరఫున లాయర్ సమర్పించడం జరిగింది. దీని ద్వారా హత్య జరిగిన సమయంలో జై ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నట్టు అతడి ఐపీ అడ్రస్ ద్వారా నిరూపితమైంది. సరిగ్గా రెహాన్ హత్య జరిగిన సమయంలో జై ఆన్‌లైన్ యానిమేషన్ చేస్తున్నట్టు అతడి కంప్యూటర్ ఐపీ అడ్రస్ ద్వారా తేలింది. తన కుమారుడికి, ఈ హత్యకు సంబంధం లేదని నిరూపించేందుకు జై తల్లిదండ్రులు అతడు ఆ సమయంలో ఉన్న లొకేషన్, ఐపీ అడ్రస్, పని చేస్తున్న సమయం తదితర వివరాలను సేకరించడంతో జై నిర్దోషిగా బయటపడ్డాడు.

గూగుల్ రిపోర్టు ప్రకారం జై ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆన్‌లైన్ యానిమేషన్ వర్క్‌లో భాగంగా పలు వెబ్‌సైట్లను సందర్శించాడు. కాగా, బాలుడి హత్య జరిగింది సాయంత్రం ఆరు గంటలకని పోలీసులు తేల్చారు. ఆగస్టు 26న జైని అరెస్ట్ చేసిన పోలీసులు 30న అభియోగాలు నమోదు చేశారు. అతడిపై కేసు నమోదు చేసిన ఎస్సై గతంలోనూ జైపై తప్పుడు కేసు నమోదు చేసి దానిని క్లోజ్ చేసేందుకు జై తండ్రిని డబ్బులు డిమాండ్ చేశారు.

అయితే ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్ వరకు వెళ్లడంతో ఆ కేసు అప్పట్లో క్లోజ్ అయింది. అప్పటి నుంచి విద్యార్థి తండ్రిపై కక్ష పెంచుకున్న ఎస్సై బాలుడి హత్య కేసును ఉద్దేశపూర్వకంగా అతడిపై నెట్టినట్టు గుర్తించిన న్యాయమూర్తి రజత్ సింగ్ జైన్ ఇన్వెస్టిగేషన్ అధికారి హరి శంకర్ మిశ్రా సహా ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ఆదేశించారు.

More Telugu News