metro rail: రైలు ప్రయాణం వల్ల విమానం మిస్.. లక్షల రూపాయలు పరిహారం కోరిన ప్రయాణికుడు!

  • ముఖ్యమైన సమావేశానికి హాజరు కాలేకపోయానని ఆవేదన
  • కంపెనీ యజమాని వద్ద పరువు పోయిందన్న బాధితుడు
  • వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన వైనం

రైలులో ప్రయాణించడం వల్ల తన విమానం మిస్ అయిందని, కాబట్టి జరిగిన తప్పిదానికి రైల్వే నుంచి తనకు పరిహారం ఇప్పించాలని కోరుతూ ఓ ప్రయాణికుడు వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. లక్నోకు చెందిన గౌరవ్ త్రిపాఠీ అనే వ్యక్తి ఈనెల 6న విమానంలో ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆయన మెట్రో రైలు ఎక్కారు. అయితే క్రాసింగ్ నిమిత్తం రైలును మార్గమధ్యంలో ఓ స్టేషన్ వద్ద దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు. ఫలితంగా ఆయన వెళ్లాల్సిన విమానాన్ని అందుకోలేకపోయారు.

దీంతో తాను ఢిల్లీ వెళ్లలేకపోవడానికి మెట్రో రైలులో జరిగిన జాప్యమే అందుకు కారణమని ఆరోపిస్తూ త్రిపాఠీ జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. రైలు ఆలస్యం వల్ల తాను ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని అందుకోలేకపోయానని, ముఖ్యమైన సమావేశానికి హాజరు కాకపోవడంతో కంపెనీ యజమాని, క్లయింట్ ల వద్ద తన పరువు పోయిందని పేర్కొంటూ కేసు దాఖలు చేశారు. తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లినందుకు గాను మెట్రో నుంచి తనకు 4.5 లక్షలు పరిహారంగా ఇప్పించాలని, కేసు కోసం తిరిగినందుకు అదనంగా మరో రూ.20 వేలు చెల్లించేలా ఆదేశించాలని గౌరవ్ త్రిపాఠీ కోరారు.

More Telugu News