stampede: అక‌స్మాత్తుగా జ‌రిగింది... ఆలోచించే స‌మ‌యం కూడా లేదు: తొక్కిస‌లాట నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ మ‌హిళ‌

  • బ్రిడ్జి కూలిపోతుంద‌నే భ‌యంతో తొక్కిస‌లాట‌
  • ఒక్క క్ష‌ణంలో 22 మంది మృతి
  • వెల్ల‌డించిన ప్ర‌త్య‌క్ష‌సాక్షి

అంద‌రూ ఒక్క‌సారిగా అరుస్తూ గుంపులుగా ప‌రిగెత్త‌డంతో ఒక్క క్ష‌ణంలో ప్ర‌మాదం జ‌రిగిపోయిందని ముంబైలో ఇవాళ ఉద‌యం జ‌రిగిన తొక్కిస‌లాట నుంచి క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ శ్రుతి లోక్రే అనే మ‌హిళ చెప్పింది. తొక్కిస‌లాట ఎలా జరిగింద‌నే విష‌యాల‌ను ఆమె ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. తొక్కిస‌లాట జ‌రిగిన‌పుడు ఆమె కూడా ఎల్ఫిన్‌స్టోన్ స్టేష‌న్‌లోని ఓవ‌ర్ బ్రిడ్జి మీదే ఉంది.

 `బ‌య‌ట వ‌ర్షం ప‌డుతుండ‌టంతో చాలా మంది బ్రిడ్జి మీదే ఉన్నారు. ఒక్క‌సారిగా బ్రిడ్జి మీద జ‌నాల సంఖ్య పెరిగింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ బ్రిడ్జి ఎప్పుడో బ్రిటీషు కాలంలో క‌ట్టింది. కింద నుంచి రైలు వెళ్తున్న ప్ర‌తిసారి అది కొద్దిగా ప్ర‌కంపిస్తుంటుంది. దీంతో దాని మీద‌ జ‌నం ఎక్కువ కావ‌డంతో కొద్దిగా క‌దిలిన‌ట్టు అనిపించింది. ఈలోగా బ్రిడ్జి కూలిపోతుంద‌ని వెనుక నుంచి ఎవ‌రో అన్నారు. అంతే... ఒక్క‌సారిగా అందరూ భ‌యానికి లోన‌య్యారు. అటు ఇటు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా క‌ద‌ల‌డానికి ప్ర‌య‌త్నించారు. మ‌న ప్ర‌మేయం లేకుండా ప‌క్క‌న ఉన్న జ‌నాలే మ‌న‌ల్ని క‌దిల్చే ప‌రిస్థితి ఏర్ప‌డింది. నా కాళ్లు గాల్లో తేలాయి. ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ్డాను. అప్ప‌టికే నా వెన‌కాల చాలా మంది చ‌నిపోయి ఉన్నారు` అని శ్రుతి వివ‌రించింది.

ఒక్క‌సారిగా వాన రావ‌డం, అదే స‌మ‌యంలో నాలుగు రైళ్లు రావ‌డం, బ్రిడ్జి కంపించ‌డం వంటి వివిధ కార‌ణాల వ‌ల్ల ప్ర‌యాణికులు భ‌య‌ప‌డి ప‌రుగులు పెట్ట‌డంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ద‌గ్గ‌ర‌లోని రైల్వే ట్రాన్స్‌ఫార్మ‌ర్ వ‌ద్ద షార్ట్ స‌ర్క్యూట్ అయ్యి గ‌ట్టి శ‌బ్దం రావ‌డంతో ప్ర‌యాణికులు ఇంకా భ‌య‌ప‌డ్డార‌ని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రపాల‌ని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ చెబుతూ, చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని, గాయ‌ప‌డిన వారికి అయ్యే వైద్య ఖ‌ర్చులను ప్రభుత్వం భరిస్తుందని ప్ర‌క‌టించారు.

More Telugu News