flowers: ఇకపై పదేళ్లయినా పూలు వాడవు.. పరిమళిస్తాయి!

  • పదేళ్ల పాటు పూలను తాజాగా నిల్వ ఉంచే విధానాన్ని రూపొందించిన ప్రొఫెసర్
  • ‘ఫ్లోరల్‌ ప్రిజర్వేషన్‌ త్రూ ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ టెక్నిక్‌’ కు పేటెంట్‌ పొందిన ప్రొఫెసర్
  • పువ్వుకి 150 రూపాయల ఖర్చు

అంతవరకూ ఎంతో అందంగా కనిపిస్తూ... ఎంతో పరిమళాన్ని వెదజల్లిన పూవు కాసేపటికే వాడిపోతుంది. దాంతో తన అందాన్ని.. పరిమళాన్ని కోల్పోతుంది. దాంతో మన మనసు చివుక్కుమంటుంది. అయితే, ఇకపై ఆ పువ్వు తాజాదనం.. పరిమళం చాలా కాలం పాటు వుండే రోజులు రానున్నాయి. పూవు వాడిపోవడం అన్నదే వుండని రోజు రానుంది. హోంసైన్స్‌ కాలేజీలో అసిస్టెంట్‌ డీన్‌ గా పని చేసిన ప్రొఫెసర్ మహలక్ష్మి పూలు ఏళ్ల తరబడి వాడిపోకుండా ఉండే విధానాన్ని రూపొందించారు. దీనిపై పేటెంట్ హక్కు కూడా సొంతం చేసుకున్నారు.

ఆ వివరాల్లోకి వెళ్తే... 1998లో హైదరాబాదులో జరిగిన ఫ్లవర్‌ షోలో వాడిపోకుండా ఉండే పూలను ప్రొఫెసర్ మహలక్ష్మి చూశారు. అలా శాశ్వతంగా వాడిపోకుండా పూలను ఉంచగలిగే సాంకేతికత వుంటే ఎంత బాగుండేది అనుకున్నారు. దీంతో పరిశోధనకు పూనుకున్నారు.

2008లో ఆచార్య ఎన్టీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పూలను భద్రపరిచే విధానంపై పరిశోధన చేసేందుకు ఆమెకు గ్రాంట్‌ మంజూరు చేసింది. ఆ తరువాత సెంట్రల్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ కూడా ఆమెకు నిధులు కేటాయించింది. దీంతో ఆమె మరిన్ని పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఆధారంగా 2016లో ఆమెకు ‘ఫ్లోరల్‌ ప్రిజర్వేషన్‌ త్రూ ఫ్రీజ్‌ డ్రైయింగ్‌ టెక్నిక్‌’ పేరిట పేటెంట్‌ లభించింది. ఈ విధానంలో పూలపై లోఫిలిజేషన్‌ అనే ప్రక్రియ ప్రయోగిస్తారు. అంటే పూలను మైనస్‌ 30 డిగ్రీల దగ్గర ఫ్రీజ్‌ చేసి వాటిలో ఉన్న తేమనంతా తీసేస్తారు. అనంతరం పూల రేకులపై ప్రత్యేకమైన కెమికల్స్‌ పూస్తారు. అనంతరం వాటిని కంటైనర్లలో భద్రపరుస్తారు.

 ఆకులపై పూసిన కెమికల్స్ ద్వారానే వాటికి అవసరమైన పోషకాలను అందేలా చేస్తారు. ఇలా చేసిన పూలను పదేళ్ల పాటు తాజాగా నిల్వ ఉంచవచ్చు. ఇది వినేందుకు సులభంగా ఉన్నప్పటికీ చాలా కష్టమైన ప్రక్రియ అని ఆమె చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ పూరేకులపై క్రిములు గుడ్లుపెడుతుంటాయని, అవి రసాయనాలకు కూడా లొంగవని ఆమె తెలిపారు. అలాగే పూలను భద్రపరిచేందుకు ఆల్ట్రావయెలెట్ కంటైనర్లు వాడాల్సి వస్తోందని, ఇలా చేయడం వల్ల ఒక పువ్వుకి 150 రూపాయలు ఖర్చవుతోందని, దీంతో వాణిజ్య అవసరాలకు అనుగుణంగా తయారు చేయలేకపోతున్నామని ఆమె అన్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపితే వాణిజ్య అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. 

More Telugu News