sikhar dhawan: పిల్లలు తప్పు చేస్తే టీచర్లు కొట్టొచ్చు: శిఖర్ ధావన్

  • క్లాస్ రూంలో ఇతర విద్యార్థులను ఇబ్బంది పెట్టిన విద్యార్థి
  • దండించిన టీచర్.. ఆమెపై పోలీస్ కేసు 
  • సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన ధావన్

పిల్లలు తప్పు చేస్తే టీచర్లు కొట్టొచ్చని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఒక వీడియోను కూడా పోస్టు చేశాడు. ఉత్తరప్రదేశ్, కాన్పూర్‌ లోని స్టెపింగ్ స్టోన్‌ ఇంటర్మీడియట్‌ కళాశాలకు చెందిన అభినవ్‌ (14) ను సైన్స్‌ టీచర్‌ నిధి డస్టర్‌ తో కొట్టారు. క్లాస్‌ జరుగుతున్న సమయంలో అభివన్‌ సహచర విద్యార్థులతో పలుమార్లు మాట్లాడాడు. దీనిపై మరో విద్యార్థి శ్రేయాన్ష్‌ శ్రీవాత్సవ టీచర్ నిధికి ఫిర్యాదు చేశాడు. అభినవ్‌ తీరుతో ఇతర విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు భావించిన నిధి పక్కనే బల్లపై ఉన్న చెక్క డస్టర్‌ తో అతని చేతిపై కొట్టారు.

అయితే అప్పటికే ఓ గాయం కారణంగా కుడిచేయి బలహీనంగా ఉందని, దానిపై కొట్టొదని అభినవ్‌ ప్రాధేయపడ్డాడు. అనంతరం తండ్రితో కలిసి గోవింద్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ లో టీచర్ పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెను కళాశాల ప్రిన్సిపల్‌ విధుల నుంచి తప్పించారు. తరగతి గదిలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న ధావన్... ‘నేను స్కూల్లో టీచర్‌ ని కాదు. కానీ, విద్యార్థులు తప్పు చేసినప్పుడు వారిని ఉపాధ్యాయులు దండించడంలో త‌ప్పేంలేదు’ అంటూ కామెంట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

More Telugu News