journalists: నక్సలైట్ల గురించి రాసే జర్నలిస్టులను చంపేయండి!: పోలీసు అధికారి ఆడియో టేప్ కలకలం

  • 30 సెకన్ల నిడివిగల ఆడియో టేప్ లో పోలీసధికారి ఆదేశం 
  • ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి ఆందోళన 
  • చర్యలు తీసుకుంటామన్న బస్తర్ ఐజీ

జర్నలిస్టులను చంపేయమంటూ పోలీసు అధికారి కింది సిబ్బందికి ఆదేశాలిచ్చిన ఆడియో టేపు బహిర్గతం కావడం పెను కలకలం రేపుతోంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీజాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గణేష్ మిశ్రా దీనిని బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల పట్ల పోలీసులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారనేందుకు ఈ ఆడియో క్లిప్పింగ్ ఉదాహరణ అని అన్నారు. ఆదివాసీల, నక్సలైట్ల వార్తలు రాసినందుకు పోలీసులు తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని, ఇప్పుడు ఏకంగా హత్యలు చేయమని ఆదేశించే వరకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఈ ఆడియో టేపులో 'జాగ్రత్తగా ఉండండి.. నక్సలైట్ల వార్తలను కవర్‌ చేయడానికి అక్కడికి వచ్చే జర్నలిస్టులను కాల్చి చంపేయండి' అంటూ పోలీసు ఉన్నతాధికారి తన కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నట్టు స్పష్టంగా ఉంది. 30 సెకన్ల నిడివిగల ఆ ఆడియో క్లిప్‌ ఫేస్‌ బుక్‌, వాట్స్ యాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలో పెను కలకలం రేపుతోంది. దీనిపై బస్తర్ రేంజ్ ఐజీ మాట్లాడుతూ, ఈ ఆడియో టేప్ తమ దృష్టికి కూడా వచ్చిందని, దీనిపై దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. ఈ టేప్ లో మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. 

More Telugu News