kulbhushan jadav: కుల్ భూషణ్ ను ఇస్తే ఆ ఉగ్రవాదిని ఇచ్చేస్తాం: ఆఫ్గన్ నుంచి ప్రతిపాదన అందిందన్న పాక్

  • వెల్లడించిన పాక్ విదేశాంగ మంత్రి ఖావాజా
  • పెషావర్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడి చేసిన ఉగ్రవాదిని బదులుగా ఇస్తాం 
  • ప్రస్తుతం విచారణ దశలో జాదవ్ మెర్సీ పిటిషన్
  • ఉరితీసే ఆలోచనను విరమించుకోని పాక్

భారత జాతీయుడు, తమ దేశంలో గూఢచార విధులు నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ, పాక్ అరెస్ట్ చేసి మరణశిక్ష విధించిన కుల్ భూషణ్ జాదవ్ ను అప్పగిస్తే, ఓ తీవ్రవాదిని అప్పగిస్తామని ఆఫ్గనిస్థాన్ నుంచి తమకు ప్రతిపాదన అందిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ వెల్లడించారు. 2014లో పెషావర్ స్కూల్ పై దాడి చేసి, ప్రస్తుతం ఆఫ్గన్ లో జైల్లో ఉన్న ఉగ్రవాదిని ఇస్తామని ఆ దేశం ప్రతిపాదించినట్టు చెప్పారు. అయితే, సదరు ఉగ్రవాది పేరును మాత్రం ఖావాజా వెల్లడించలేదు.

పెషావర్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ పై దాడి చేసి సుమారు 150 మంది విద్యార్థులను, ఉపాధ్యాయులను, సెక్యూరిటీ గార్డులను పొట్టన బెట్టుకున్న ఆ ఉగ్రవాది ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. న్యూయార్క్ లోని ఆసియా సొసైటీని ఉద్దేశించి ప్రసంగించిన ఆసిఫ్, జాదవ్ ను తమకు అప్పగిస్తే, ఆ ఉగ్రవాదిని పాక్ కు పంపుతామని ఆఫ్గన్ ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్) నుంచి ప్రతిపాదన వచ్చిందని అన్నారు.

అయితే, దీనిపై తమ దేశ నిర్ణయం ఏంటన్నది మాత్రం ఆయన చెప్పలేదు. తమ ప్రాంతంలో తాము శాంతిని కాంక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఖావాజా వ్యాఖ్యానించారు. కాగా, జాదవ్ కు న్యాయసహాయం అందకుండా చూస్తూ, వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తోందని ఇండియా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, జాదవ్ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తులు తిరస్కరణకు గురైతే తప్ప, అతనిని ఉరి తీయబోమని పాక్ ఇప్పటికే ప్రకటించింది.

More Telugu News