Russian colonel: బాప్‌రే! లంచం మరీ ఇన్ని కోట్లా?.. కాంట్రాక్టు ఇచ్చేందుకు రూ.41 కోట్లు లంచం తీసుకున్న రష్యా కల్నల్!

  • రష్యా రక్షణ శాఖ చరిత్రలో అది పెద్ద లంచం కేసు
  • విస్తుపోయిన ప్రభుత్వం
  •  నిజాయతీ గల అధికారిగా కల్నల్‌కు మంచిపేరు!

రష్యా చరిత్రలోనే కనీవినీ ఎరుగని లంచం కేసు ఒకటి బయటపడింది. తన మద్దతుదారులకు కాంట్రాక్టులు ఇప్పించడం ద్వారా 6.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.41 కోట్లు) లంచం తీసుకున్న ఆర్మీ కల్నల్‌ను రష్యా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖలో ఇదే అతిపెద్ద అవినీతి కేసు అని చెబుతున్నారు.

రక్షణ మంత్రిత్వ శాఖలోని ఆహార పదార్థాల సరఫరా  మేనేజ్‌మెంట్ విభాగానికి కల్నల్ అలెగ్జాండర్ వాకులిన్ (46) హెడ్‌గా ఉన్నారు. మంత్రిత్వ శాఖ అవసరాల కోసం మొబైల్ ఫీల్డ్ కిచెన్లు, బేకరీలు, నీటి తొట్టెలు తదితర వాటిని ఏర్పాటు చేసేందుకు తనకు నమ్మకస్తులైన వాణిజ్య సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందుకోసం ఏకంగా రూ.41 కోట్లు లంచంగా తీసుకున్నారు. కేసును విచారిస్తున్న మిలటరీ కోర్టు వాకులిన్‌ను అక్టోబరు 29 వరకు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

వాకులిన్‌ను నిర్బంధంలోకి తీసుకోవాలన్న మిలటరీ కోర్టు ఆదేశాలను వాకులిన్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. తన క్లయింట్‌కు విదేశాలకు పారిపోయే ఉద్దేశం ఉందని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, అతడికి ఎటువంటి నేర చరిత్ర లేదని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని కానీ, సాక్షులను బెదిరిస్తారని కానీ నిరూపించలేకపోయారని అన్నారు. అయితే కోర్టు వారి వ్యాఖ్యలను కొట్టిపారేసింది. కాగా, కల్నల్ వాకులిన్ అరెస్ట్‌కు ముందు ఆయనో మంచి అధికారి. అతడి విజయవంతమైన కెరీర్‌లో ఇప్పటి వరకు చిన్న మచ్చ కూడా లేకపోవడం గమనార్హం.

More Telugu News