క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం.. మరోపక్క శశికళ భర్త అనారోగ్యం.. తమిళనాడులో హై అలర్ట్!

27-09-2017 Wed 12:01
  • వేడెక్కిన తమిళనాడు
  • హైఅలర్ట్ ప్రకటించిన డీజీపీ
  • నిన్ననే చెన్నై చేరుకున్న గవర్నర్
  • రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం
తమిళనాట టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఓవైపు డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం క్షీణించింది... మరోవైపు అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ భర్త నటరాజన్ ఆరోగ్యం కూడా విషమించింది. దీనికి తోడు తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు నిన్న హుటాహుటిన చెన్నై చేరుకున్నారు. దీంతో, ఏదో జరగబోతోందన్న అనుమానం తమిళనాట నెలకొంది. ఇదే సమయంలో, పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు హై అలర్ట్ ఉత్తర్వులను డీజీపీ రాజేంద్రన్ జారీ చేశారు. సెలవుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి కూడా సెలవులను రద్దు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.