polavaram: 'నాన్నా...' అంటూ వచ్చి తండ్రిని నట్టేట ముంచింది!

  • ఓ చిన్న రైతుకు పోలవరం పరిహారంగా డబ్బులు
  • డబ్బు కాజేసేందుకు వచ్చిన రెండో భార్య కుమార్తె
  • ఇద్దరు యువకులతో కలసి షాపింగ్
  • పోలీసు కేసు నమోదు

'నీ కూతురినే కదా నాన్నా' అంటూ ప్రేమను ఒలకబోస్తూ, 23 ఏళ్ల నాడు తెగిపోయిన బంధానికి సెంటిమెంటుతో ప్రాణంపోసి, కన్న తండ్రినే నట్టేట ముంచిందో యువతి. సుమారు రూ. 7.30 లక్షలు కాజేసింది. తెలంగాణ రాష్ట్రం ఆశ్వారావుపేట మండలం దురదపాడు గ్రామవాసి, బాధితుడు కొర్సా రాజులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజుకు ఇద్దరు భార్యలు. రెండో భార్య వీరమ్మ కాగా, వీరికి ఓ కుమార్తె అనిత ఉంది. 23 ఏళ్ల క్రితం సరిగ్గా చూసుకోవడం లేదని ఆరోపిస్తూ, వీరమ్మ, అనితను తీసుకుని వెళ్లిపోయి మరో పెళ్లి చేసుకుంది. రాజు కూడా వీరమ్మను, బిడ్డను మరచిపోయి మొదటి భార్యతోనే ఉంటూ ఉన్నాడు. రాజుకు పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలోని దామరచర్ల గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ముంపులో భాగంగా ఇది ప్రభుత్వ పరం కావడంతో దాదాపు రూ. 50 లక్షలు నష్టపరిహారంగా రానుంది.

అప్పుడే అసలు కథ మొదలైంది. పరిహారం విషయాన్ని తెలుసుకున్న అనిత రంగంలోకి దిగింది. రాజు దగ్గరికి వచ్చి 'నాన్నా' అంటూ పలకరించింది. ఆరోగ్యంపై జాగ్రత్తలు చెప్పింది. పరిహారం గురించి ప్రస్తావించకుండా, బ్యాంకు ఖాతా, ఏటీఎం నిర్వహణ వంటివి నేర్పింది. చదువుకున్న కుమార్తెను చూసి రాజు ఆనందపడిపోయాడు. ఇద్దరు యువకులతో కలసి అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వచ్చి యోగక్షేమాలు అడిగి వెళ్లేది.

అదే సమయంలో పావు ఎకరం పొలానికి పరిహారంగా రూ. 8.60 లక్షలు రాజు ఖాతాలో పడ్డాయి. నమ్మకంగా ఉంటూ తండ్రి అవసరానికి డబ్బు డ్రా చేసి ఇచ్చి పోతూ, పనిలో పనిగా తన పనినీ ముగించింది అనిత. రాజు ఓ లక్ష రూపాయలు వాడుకుంటే, మిగతా డబ్బులో రూ. 7.30 లక్షలు మాయమయ్యాయి. విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాజు, బ్యాంకు అధికారులను సంప్రదించి, వివిధ ఏటీఎంలు, షాపింగ్ నిమిత్తం డబ్బులు డ్రా అయినట్టు తెలుసుకుని బావురుమన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, అనితతో పాటు మరో ఇద్దరు యువకులు ఈ పని చేసినట్టు తేల్చారు. కేసును విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News