raghu: మరో సంచలనం... అవినీతి అనకొండ రఘుకు బినామీగా ఐఏఎస్ అధికారి కుమార్తె సుమేధ!

  • రఘు సంస్థలో డైరెక్టర్ గా ఉన్న సుమేధ
  • సుబురి బిల్డర్స్ లో సుమేధ పేరిట పెట్టుబడులు
  • తమ ఆస్తులమ్మి పెట్టుబడులు పెట్టామన్న సుమేధ తండ్రి

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి జీవీ రఘురామిరెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సోదాలు జరుపుతున్న అధికారులు, మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. రఘుకు బినామీగా ఓ ఐఏఎస్ అధికారి కుమార్తె సుమేధ శర్మ ఉన్నట్టు ఏసీబీ అధికారులు దర్యాప్తులో కనుగొన్నారు. సుమేధ తండ్రి సమీర్ శర్మ సెంట్రల్ గవర్నమెంటులో గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖలో అడిషనల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

ఆయన మునిసిపల్ కమిషనర్ గా విజయవాడలో పనిచేసిన సమయంలో రఘురామిరెడ్డి, శివప్రసాద్ కుటుంబాలతో పరిచయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆపై ఆమెను రఘుకు చెందిన సుబురి బిల్డర్స్ లో డైరెక్టర్ గా కూడా నియమించారని, ఆమె పేరిట పలు ఆస్తులను కూడా రఘు కొనుగోలు చేశాడని చెప్పారు. కాగా, నిన్నటికి రఘు వద్ద 11 కిలోల బంగారం, 25 కిలోల వెండి, వజ్రాల నగలు లభించాయని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ఆయనకు ఉన్న మరో బినామీ చింతమనేని గాయత్రి పేరిట ఎన్నో విలువైన ఆస్తులున్నాయని తెలిపారు. కాగా, తాము పెద్దల నుంచి వచ్చిన ఆస్తులను అమ్మి సుబురి బిల్డర్స్ లో పెట్టుబడులు పెట్టినట్టు సమీర్ శర్మ చెబుతుండటం గమనార్హం.

More Telugu News