kancha ilaiah: నువ్వెంత, నీ బతుకెంత... అంబేద్కర్ మాటలే మరచిపోయావా?: కంచె ఐలయ్యపై అంబికా కృష్ణ నిప్పులు

  • కోట్ల రూపాయలు పన్నులు కట్టే వైశ్యులను అవమానించావు
  • చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే
  • డిమాండ్ చేసిన టీడీపీ నేత అంబికా కృష్ణ

'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనల హోరు ఇంకా తగ్గలేదు. ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని నిత్యమూ ఎక్కడో ఒకచోట వైశ్య సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఏలూరులో జరిగిన నిరసనకు హాజరైన టీడీపీ నేత అంబికా కృష్ణ, ఐలయ్యపై నిప్పులు చెరిగారు. ఐలయ్య పుస్తకంపై గాంధీ జయంతి నుంచి రెండో దశ ఉద్యమం మొదలు పెట్టనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"న్యాయంగా వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ట్యాక్స్ కట్టే వైశ్యులను అవమానిస్తావా? ఇటువంటి ఓ మంచి జాతిని ఓ దౌర్భాగ్య, నీచ, నికృష్ణ ఐలయ్యగాడు... ఓ గొట్టంగాడు అంటున్నాడు. వినవయ్యా... నువ్వెంత, నీ బతుకెంత? మీ అమ్మా, నాన్నలు నిన్ను చదివించినప్పుడు మావాడు మంచి ప్రయోజకుడు కావాలని చదివించి ఉంటారు. వాళ్లిప్పుడు బతికున్నారో లేదో తెలియదు. ఇప్పటి నీ స్థితిని చూస్తే వాళ్లు బాధపడతారు. దగ్గర దగ్గర నీకు 66 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులో ఈ రాతలేంటయ్యా? అంబేద్కర్ చెప్పిన మాటలే మరిచావా? రాజ్యాంగం రాసేటప్పుడే ఆయన చెప్పారు. కులాలు, మతాలు లేని దేశంగా ఈ భారతదేశం వెలుగొందాలని" అంటూ విరుచుకుపడ్డారు. ఐలయ్య పుస్తకంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేనున్నామని, చివరిగా ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

More Telugu News