ankit: ఉద్యోగంలో తృప్తి లేదంటూ 23వ అంతస్తు నుంచి దూకేసిన ఐఐటీయన్

  • రెండు టవర్లను కలిపే వాక్ వే పై నుంచి దూకిన అంకిత్
  • మానసిక ఒత్తిడే కారణమన్న పోలీసులు

తాను చేస్తున్న ఉద్యోగంలో తృప్తి లభించడం లేదన్న మనస్తాపంతో అంకిత్ వాద్వా (26) అనే ఐఐటీయన్ తానుంటున్న భవంతి 23వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ గోల్ఫ్ కోర్స్ రోడ్ ప్రాంతంలోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్ వద్ద జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, తన మామతో కలసి ఇక్కడి ఓ అపార్టుమెంటులో ఉన్న అంకిత్, ఉద్యోగం చేస్తూనే, ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నాడు. జీమ్యాట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు.

నిన్న డిన్నర్ చేసిన తరువాత తన రూములోకి వెళ్లిన అంకిత్ మృతదేహం నాలుగు గంటల తరువాత గ్రౌండ్ ఫ్లేర్ లో కనిపించింది. రెండు టవర్లనూ కలిపే వాక్ వే పై నుంచి అంకిత్ దూకినట్టుగా తెలుస్తోంది. మానసిక ఒత్తిడి కారణంగానే అంకిత్ ఇంత ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడని, గత 16 నెలలుగా అతను ఒత్తిడిలో ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైందని పోలీసు అధికారి గౌరవ్ ఫోగత్ తెలిపారు. ఉన్నత విద్య చదివి మరింత ఎత్తునకు ఎదగాలన్నది అతని ఆశయమని, తన మీద ఉన్న బాధ్యతలు ఆశయానికి అడ్డుగా ఉన్నాయని భావించేవాడని తెలిపారు. కాగా, ఈ కేసును ఇతర కోణాల్లోనూ విచారిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News