sachin: అలా మోదీ చెప్పారు... ఇలా సచిన్ ఆచరించారు!

  • 'స్వచ్ఛతా హీ సేవ'లో పాల్గొన్న సచిన్
  • వెస్ట్ బాంద్రాలో చీపురు పట్టి రోడ్లు శుభ్రం చేసిన క్రికెట్ దిగ్గజం 
  • పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు

స్వచ్ఛ భారత్ మిషన్ లో పాల్గొని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, 'స్వచ్ఛతా హీ సేవ'లో పాల్గొని రానున్న గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును భారతరత్న సచిన్ టెండూల్కర్ అందుకున్నారు. మోదీకి తన మద్దతును ఇప్పటికే తెలిపిన ఆయన, ఈ ఉదయం ముంబై వెస్ట్ బాంద్రా ప్రాంతంలో చీపురు పట్టి రోడ్డెక్కారు. వీధులను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, చుట్టూ ఉన్న ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనమంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. మోదీ చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతున్నట్టు తెలిపారు. కాగా, స్వచ్ఛ భారత్ సాధనలో భాగంగా 'స్వచ్ఛతా హీ సేవా'ను చేపట్టామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మోదీ కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పలువురు సెలబ్రిటీలకు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. దక్షిణాదిలో మోహన్ లాల్, రజనీకాంత్, రాజమౌళి తదితరులకు మోదీ లేఖలు రాయగా, వారంతా తమవంతు సహకారాన్ని అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, అనుష్కా శర్మ తదితరులు కూడా మోదీ ఆలోచనలో పాలు పంచుకునేందుకు అంగీకారాన్ని తెలిపారు.

More Telugu News