honeypreet: ఇండియాలోనే హనీప్రీత్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై సంతకం పెట్టి మాయం... కనిపెట్టలేకపోయిన పోలీసులు!

  • లజపత్ నగర్ లోని కార్యాలయానికి హనీప్రీత్
  • ఆ వెంటనే మాయం
  • ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలియదన్న న్యాయవాది

హర్యానా పోలీసులు సహా, దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో వెతుకుతున్న డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెంపుడు కుమార్తె హనీప్రీత్ సింగ్ ఇండియాలోనే ఉన్నట్టు స్పష్టమైంది. తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుకుంటున్న ఆమె, లజపత్ నగర్ లోని తన కార్యాలయానికి వచ్చి, బెయిల్ పత్రాలపై సంతకాలు చేసి మాయమైంది. ఆమె వచ్చి వెళ్లిన విషయాన్ని నిఘా అధికారులు, గుర్మీత్ కేసును విచారిస్తున్న పోలీసులు కనిపెట్టలేక పోవడం గమనార్హం.

ఇక హనీప్రీత్ వచ్చి వెళ్లిన విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది ప్రదీప్ ఆర్య స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పిన ఆయన, హనీప్రీత్ తరఫున ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే, బెయిల్ ఆలస్యం కావచ్చని భావిస్తున్నానని, అయితే, ఈ పిటిషన్ ను సాధ్యమైనంత త్వరగా పరిశీలించాలని తాను న్యాయమూర్తిని కోరనున్నానని తెలిపారు.

కాగా, గుర్మీత్ కు పంచకుల సీబీఐ స్పెషల్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షను విధించిన తరువాత, సిర్సా, పంచకుల తదితర ప్రాంతాల్లో అల్లర్లు, నిరసనలు చెలరేగగా, 41 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అల్లర్లు చేసేలా గుర్మీత్ అనుచరులను హనీప్రీత్ రెచ్చగొట్టిందన్నది ఆమెపై ఉన్న ప్రధాన అభియోగం. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఆమె పేరును చేర్చిన పోలీసులు, లుక్ అవుట్ నోటీసులూ జారీ చేశారు.

More Telugu News