Sushma: పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉంది.. మిత్రదేశానికి షాకిచ్చిన డ్రాగన్ కంట్రీ!

  • అంగీకరించిన చైనా అధికారిక మీడియా
  • ఐరాసలో సుష్మ ప్రసంగంపై విమర్శలు
  • చైనాతో సఖ్యతగా ఉండాలని, పాక్‌ను గౌరవించాలని సుద్దులు

మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరోమారు షాకిచ్చింది.  ఆ దేశంలో ఉగ్రవాదం ఉందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ పాక్‌పై దండెత్తడాన్ని ‘దురహంకారంగా’ అభివర్ణిస్తూనే, ‘నిజానికి పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉంది’’ అని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.

ఐరాసలో సుష్మ మాట్లాడుతూ ఐటీ రంగంలో భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతుంటే, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేస్తోందని దుయ్యబట్టారు. తమ మిత్రదేశాన్ని సుష్మ నిందించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న చైనా మీడియా సుష్మ ప్రసంగాన్ని దురహంకారంగా అభివర్ణించింది. అయితే పాకిస్థాన్‌లో ఉగ్రవాదం ఉందన్న విషయం నిజమేనని అంగీకరించింది.

‘‘పాకిస్థాన్‌లో నిజానికి ఉగ్రవాదం ఉంది. అయితే ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ప్రభుత్వ విధానమా? ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేయడం వల్ల పాక్‌ ఆశించేదేమిటి? డబ్బా? గౌరవమా? అని గ్లోబల్ టైమ్స్ ప్రశ్నించింది.

‘‘ఇండియా మూఢవిశ్వాసం దాని ఆశయానికి సరిపోలడం లేదు’’ అన్న శీర్షికతో రాసిన సంపాదకీయంలో ఈ విషయాన్ని పేర్కొంది. అమెరికా, యూరప్‌లతో చేతులు కలిపి పొరుగు దేశాలను భయపెట్టాలని భారత్ చూస్తోందని, అయితే అటువంటి ఆలోచనలు మాని చైనాతో సఖ్యంగా ఉంటూ పాకిస్థాన్‌ను గౌరవించాలని సుద్దులు చెప్పింది. ఐరాసలో పాకిస్థాన్‌ను ఎండగట్టడంపైనా, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్‌ను వెనకేసుకొస్తున్న చైనాపైనా ఐరాసలో సుష్మ చేసిన ప్రసంగంపైనా ‘గ్లోబల్ టైమ్స్’ విమర్శలు చేసింది.

More Telugu News