ప్రాచీన భారతంలో దుర్గామాత రక్షణ శాఖ మంత్రి, లక్ష్మీదేవి ఆర్థిక శాఖ మంత్రి!: వెంకయ్య నాయుడి చమత్కారం

23-09-2017 Sat 08:59
  • కొనియాడిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • మన తత్వాలు, సంస్కృతి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయని వ్యాఖ్య
  • ఇప్పుడు రామ రాజ్యం అన్నా మతం రంగు పులుముతున్నారని ఆవేదన
ప్రాచీన భారతదేశంలో దుర్గామాత రక్షణ శాఖ మంత్రి, లక్ష్మీదేవి ఆర్థిక శాఖా మంత్రిగా ఉండేవారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. మొహాలీలోని ఇండియన్ బిజినెస్ స్కూల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘పురాణాల నుంచి మనం తీసుకుంటే సరస్వతీ దేవి విద్యాశాఖామంత్రిగా, దుర్గామాత రక్షణశాఖా మంత్రిగా, లక్ష్మీదేవి ఆర్థిక మంత్రిగా ఉన్నారు’’ అని వెంకయ్య అనగానే ఆడిటోరియం విద్యార్థుల కేరింతలతో మార్మోగింది. సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యం గురించి చెబుతూ మన శాస్త్రాలు, సంస్కృతి మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు.

దేశంలోని నదులన్నీ స్త్రీల  పేర్లతో కూడుకున్నవేనని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. గంగా, యమున, కావేరి, నర్మద, మహానది, తపతి తదితర నదులు ఇందుకు ఉదాహరణ అని అన్నారు. మన దేశాన్ని కూడా భరత మాత అని పిలుస్తామని, లేదంటే ‘మదర్ ఇండియా’ అంటామని వివరించారు. దేశ వారసత్వ సంపదలో భాగమైనందుకు విద్యార్థులు గర్వించాలని అన్నారు.

‘‘మీరు ఏ భాషైనా మాట్లాడండి. అయితే అవతలి వ్యక్తికి మీ మాతృభాష తెలియకపోతేనే ఆ పని చేయండి’’ అని విద్యార్థులకు సూచించారు. చరిత్రలో రామ రాజ్యానికి ఉన్న గొప్పదనం అంతా ఇంతా కాదని, అది ఇప్పటికీ రోల్ మోడల్‌గానే నిలుస్తోందని వెంకయ్య వివరించారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు రామరాజ్యం గురించి మాట్లాడితే దానికి కూడా మతం రంగు పులుముతున్నారని ఉప రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు.