stock market: మరోసారి మార్కెట్ కొంపముంచిన కిమ్!

  • ట్రంప్ కు హెచ్చరికలు జారీ చేసిన కిమ్
  • నష్టపోయిన ఆసియా మార్కెట్లు
  • అదే దారిలో సెన్సెక్స్, నిఫ్టీ
  • 264 పాయింట్ల పతనంలో సెన్సెక్స్
  • ఒక శాతానికి పైగా నష్టంలో నిఫ్టీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఉద్దేశిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించి వేయడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు భారీ నష్టాల్లో మునిగిపోయాయి. మరోసారి హైడ్రోజన్ బాంబును కిమ్ పరీక్షించనున్నారని వచ్చిన వార్తలు ఆసియా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేయగా, అదే ప్రభావం ఇండియాలోనూ కనిపించింది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 264 పాయింట్లు పడిపోయి 0.82 శాతం నష్టంతో 32,105 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 1.08 శాతం నష్టంతో 10,012 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అంతకుముందు ఓ దశలో నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 10 వేల స్థాయికన్నా కిందకు దిగజారింది. ఆ సమయంలో కొంతమేరకు నూతన కొనుగోళ్లు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచికలు ఒక శాతానికి పైగా నష్టాల్లో నడుస్తున్నాయి. హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, సిప్లా, సన్ ఫార్మా తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, యస్ బ్యాంకు, హిందాల్కో, అల్ట్రా టెక్ సిమెంట్స్, వీఈడీఎల్ తదితర కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ 82 పైసలు నష్టపోయింది.

ఇక గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే, స్ట్రెయిట్స్ టైమ్స్ స్థిరంగా ఉండగా, మిగతా ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. నిక్కీ పావు శాతం, హ్యాంగ్ సెంగ్ 0.77 శాతం, తైవాన్ సూచిక 1.23 శాతం, కోస్పీ 0.74 శాతం, జకార్తా కాంపోజిట్ 0.3 శాతం, షాంగై కాంపోజిట్ 0.33 శాతం నష్టపోయాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ 0.38 శాతం దిగజారింది.

More Telugu News