2nd one day: స్మిత్ క్యాచ్ పట్టినా, కేన్ రిచర్డ్ సన్ స్టంప్ అవుట్ చేసినా హార్డిక్ పాండ్య అవుట్ కాలేదు!

  • అంపైర్ అవుటివ్వకపోవడంతో నిరాశ చెందిన స్టీవ్ స్మిత్
  • రన్ అవుట్ కదా? అంటూ అంపైర్ ను ప్రశ్నించిన స్మిత్
  • నోబాల్ ప్రకటించిన అంపైర్

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టినా, బౌలర్ కేన్ రిచర్డ్ సన్ స్టంప్ అవుట్ చేసినా హార్డిక్ పాండ్య అవుట్ కాని చిత్రమైన ఘటన రెండో వన్డేలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... 48.4వ బంతిని కేన్ రిచర్డ్ సన్ సంధించగా, క్రీజులో ఉన్న హార్డిక్ పాండ్య బలంగా ఆన్ సైడ్ దిశగా బౌండరీ దాటించే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ మిడిల్ లో తగలకపోవడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో మిడ్ వికెట్ మీద ఫిల్డింగ్ చేస్తున్న స్మిత్ దానిని ఒడిసి పట్టుకున్నాడు. దీంతో అవుట్ అని భావించిన హార్డిక్ పాండ్య అంపైర్ సిగ్నల్ కోసం చూడకుండా పెవిలియన్ బాటపట్టాడు.

ఇంతలో ఒక్కసారిగా చినుకులు పడ్డాయి. దీంతో అంపైర్లు మైదానం వీడే ప్రయత్నంలో ఉన్నారు. అంపైర్ అవుట్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో.. వర్షం పడుతోందని హార్డిక్ పాండ్య మైదానం వీడాడని భావించిన స్మిత్ రన్ అవుట్ చేసేందుకు బౌలర్ కేన్ రిచర్డ్ సన్ కు బంతిని అందించాడు. రిచర్డ్ సన్ వికెట్లను గిరాటేసి అంపైర్ కేసి చూశాడు. ఇంతలో వర్షానికి అంతా మైదానం వీడారు. వర్షం తెరిపి ఇచ్చిన తరువాత మళ్లీ బ్యాటింగ్ కు హార్డిక్ పాండ్య దిగాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఆశ్చర్యపోగా, స్మిత్ నేరుగా అంపైర్ ను ప్రశ్నించాడు. దీంతో అంపైర్ బంతి ఛాతి కంటే ఎత్తుగా వచ్చిందని, అది నోబాల్ అని అందుకే అవుటివ్వలేదని అన్నారు. మరి రన్ అవుట్ ఉంది కదా? అనడంతో అంపైర్ నోబాల్ సిగ్నల్ ప్రకటించక ముందు స్టంప్ చేస్తే అవుట్ కాదని స్పష్టం చేయడంతో నిరాశచెందాడు. అయితే స్మిత్ భయపడ్డట్టు హార్డిక్ పాండ్య భారీ షాట్లు ఆడలేదు. 

More Telugu News