india: పాకిస్థాన్ కాదది 'టెర్రరిస్థాన్'... ఐరాస వేదికగా నిప్పులు చెరిగిన ఇండియా

  • భారత్ తరఫున ప్రసంగించిన ఈనామ్ గంభీర్
  • ఉగ్రవాదులను స్వయంగా తయారు చేస్తున్న పాక్
  • నిధులిచ్చి పెంచి పోషిస్తున్నారు
  • లాడెన్ ను మట్టుబెట్టింది పాక్ లో కాదా?
  • ఇప్పుడు హఫీజ్ సయీద్ ఆ దేశంలో లేడా?
  • ప్రశ్నల వర్షం కురిపించిన ఈనామ్

పాకిస్థాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖాకాన్ అబ్బాసీ, తన తొలి ఐరాస ప్రసంగంలో భారత్ పై తీవ్ర విమర్శలు చేసిన వేళ, భారత్ దీటుగా స్పందించింది. ఐరాసలో భారత కార్యదర్శి ఈనామ్ గంభీర్ తనకు లభించిన ప్రసంగ అవకాశాన్ని వినియోగించుకుని పాక్ పై నిప్పులు చెరిగారు. "పాకిస్థాన్ ఇప్పుడు టెర్రరిస్థాన్. అసలైన ఉగ్రవాదానికి ఆ దేశమే ఆశ్రయమిస్తోంది. ఉగ్రవాదులను స్వయంగా తయారు చేస్తూ ప్రపంచంపైకి వదులుతోంది. ఇంత అధికంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశం మరొకటి లేదు. పాక్ తో పెను ప్రమాదం పొంచివుంది. అమెరికాపై పెను దాడికి దిగిన ఒసామా బిన్ లాడెన్ కు పాక్ ఆశ్రయమిచ్చిందన్న విషయాన్ని ఎవరూ మరువరాదు. అమెరికా దళాలు ఒసామాను పాక్ పట్టణం అబోటాబాద్ లోనే హతమార్చాయి. ఉగ్రనేత, ఎన్నో కుట్రల సూత్రధారు హఫీజ్ సయీద్ ఇప్పుడు ఆ దేశంలోనే ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? కాదని పాక్ ఒప్పుకోగలదా?" అని ఆమె ప్రశ్నించారు.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన నేత హఫీజ్ సయీద్ ను ఐరాస గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించిందన్న విషయాన్ని గుర్తు చేసిన ఆమె, అయినప్పటికీ, పాక్ అతనిపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను పంపుతూ విధ్వంసాలకు దిగుతోందని, తామెంతో సంయమనంగా ఉంటున్నామని తెలిపారు. మౌలిక వసతులు, సంక్షేమ పథకాల పేరు చెప్పి, అమెరికా వంటి పెద్ద దేశాల నుంచి నిధులను సేకరించి, ఉగ్రవాద సంస్థలకు బిలియన్ డాలర్ల కొద్దీ డబ్బును పంపుతున్న దేశం కూడా పాకిస్థానేనని ఆమె ఆరోపించారు. పాక్ వీధుల్లో ఉగ్రవాదులు బహిరంగంగానే తుపాకులతో తిరుగుతూ ఉంటారని, మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని గంభీర్ వ్యాఖ్యానించారు. ఓ విఫలమైన దేశంగా ఉన్న పాకిస్థాన్, ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పడమేంటని ఆమె ప్రశ్నించారు

More Telugu News