law student: గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలికి హైకోర్టు మందలింపు.. కింది కోర్టు తీర్పు రద్దు!

  • గ్లోబల్ యూనివర్సిటీలో న్యాయవిద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు తీర్పు
  • హర్యానాలో సంచలనం సృష్టించిన కేసు
  • నిందితులకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కింది న్యాయస్థానం
  • గ్యాంగ్ రేప్ కి బాధితురాలి మానసిక ప్రవర్తనే కారణమన్న హైకోర్టు 
  • వాట్స్ యాప్ సాక్ష్యంతో తీర్పు 
  • యువకుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని కింది కోర్టు తీర్పు రద్దు 

2015లో హర్యానాలోని సోనేపట్‌ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో న్యాయవిద్యనభ్యసిస్తున్న హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్‌ అనే విద్యార్థులు తమ జూనియర్‌ అమ్మాయిపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, వాటిని యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారు. సెక్స్ టాయ్స్ కొనిచ్చి వాటిని వాడుతూ, స్కైప్ లో లైవ్ వీడియో చూపించాలని బెదిరించేవారు. వీరి మధ్య సాగిన అన్ని అంశాలూ వాట్స్ యాప్ లో భద్రంగా ఉండిపోయాయి.

ఈ కేసు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దీనిని విచారించిన న్యాయస్థానం...చరిత్రలో తొలిసారి వాట్స్ యాప్ ఛాట్ ను సాక్ష్యంగా తీసుకుని ఇందులో నిందితులు ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒకరికి ఏడేళ్ల కారాగార శిక్షను విధించింది. దీంతో వారు హర్యానా, చండీగడ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన జస్టిస్ మహేష్ గ్రోవర్, జస్టిస్ రాజశేఖర్ అట్టిరితో కూడిన ద్విసభ్య బెంచ్ బాధిత యువతిని మందలించి, కింది కోర్టు వేసిన శిక్షను కొట్టివేసింది. అనంతరం బాధితురాలి మానసిక పరివర్తనే జరిగిన అఘాయిత్యానికి కారణమని బెంచ్ స్పష్టం చేసింది.

‘బాధితురాలు కాస్త కూడా పరిణతి లేకుండా వ్యవహరించింది. యువకులతో మరీ సాన్నిహిత్యంగా మెలిగింది. పైగా లైంగికపరమైన కోరికలతోనే స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసింది. దర్యాప్తులో అమ్మాయి అన్ని విషయాలను ఒప్పుకుంది. వైద్యులు కూడా యువతి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదన్న విషయాన్ని తేల్చారు. అలాంటప్పుడు బలవంతంగా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు సరికాదు. అదే సమయంలో నిందితులకు కూడా అంత కఠిన శిక్ష విధించాల్సిన అవసరం లేదు’ అని ద్విసభ్య బెంచ్‌ అభిప్రాయపడింది. ఇదే సమయంలో విద్యార్థుల భవిష్యత్ ను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. 

More Telugu News