వర్మ: మ‌నం అంతగా గౌర‌వించే ఎన్టీఆర్ అసలు లక్ష్మీ పార్వ‌తికి ఎందుకంత ప్రాధాన్య‌త ఇచ్చారు?: రామ్ గోపాల్ వ‌ర్మ

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై వర్మ వివరణ 
  •  రామారావు చివరిరోజుల్లో అనుభవించిన మానసిక సంఘర్షణపై స్ట‌డీ చేశా
  • నేను రామారావుకి పెద్ద అభిమానిని
  • ల‌క్ష్మీ పార్వ‌తిని నేనెప్పుడూ క‌ల‌వ‌లేదు.. మాట్లాడలేదు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టి రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి తీయ‌బోతున్నాన‌ని చెప్పిన‌ వ‌ర్మ.. అంద‌రి దృష్టీ త‌న‌పై ప‌డేలా చేసుకున్నాడు. బ‌యోపిక్ అంటే వాస్త‌వాలు తీయాల‌ని, ఎలా ప‌డితే అలా చూపించ‌కూడ‌ద‌ని ల‌క్ష్మీ పార్వ‌తి కూడా ఈ సినిమాపై స్పందించడం జరిగింది. ఈ సినిమాలో నిజాలు లేక‌పోతే ఎదురుతిరుగుతాన‌ని కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ సినిమాపై వ‌ర్మ స్పందించారు. బ‌యోపిక్ అంటే ఓ మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి చ‌నిపోయేవ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీస్తార‌ని, అలా కాకుండా ఓ కీల‌క సంఘ‌ట‌న నుంచి కూడా మొద‌ల‌వుతుంద‌ని చెప్పారు. గ‌తంలో మ‌హాత్మాగాంధీ బ‌యోపిక్‌ని ఆయ‌నను రైల్లోంచి తోసేసిన ఘ‌ట‌న నుంచి మొద‌లు పెట్టార‌ని వర్మ గుర్తు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో తాను కూడా రామారావు జీవితంలో జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న నుంచి మొద‌లుపెడ‌తాన‌ని చెప్పారు. తాను రామారావుకి పెద్ద అభిమానిన‌ని, ఎంతో గొప్ప మ‌నిషి అయిన రామారావు చివ‌రి రోజుల్లో బాధ‌ప‌డ్డార‌ని తెలిపారు. ఎటువంటి భావోద్వేగాలు లేని తాను కూడా ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో చేసిన వ్యాఖ్య‌ల‌ను ఓ వీడియోలో చూసి క‌న్నీరు పెట్టుకున్నాన‌ని చెప్పుకొచ్చారు.

అటువంటి వ్య‌క్తి గురించి అంద‌రూ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వర్మ అన్నారు. చివ‌రి రోజుల్లో రామారావు ఎదుర్కున్న ప‌రిస్థితులను, ఆయ‌న మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను తెలుపుతాన‌ని చెప్పారు. ల‌క్ష్మీ పార్వ‌తిని తానెప్పుడూ క‌ల‌వ‌లేదని, ఆమెతో ఎప్పుడూ మాట్లాడ‌లేదని అన్నారు. ల‌క్ష్మీపార్వ‌తిది రామారావు జీవితంలో నెగిటివ్ రోల్ అని కూడా కొంద‌రు అనుకుంటున్నార‌ని చెప్పారు. మ‌నం ఇంతగా గౌర‌వించే రామారావు అసలు లక్ష్మీ పార్వ‌తికి ఎందుకంత ప్రాధాన్య‌త ఇచ్చార‌ని వ‌ర్మ ప్ర‌శ్నించారు. ఆ విష‌యం అంద‌రికీ తెలియాల్సి ఉందని, ఈ ప‌రిస్థితుల‌పై తాను చాలా స్ట‌డీ చేశాన‌ని, ఈ సినిమాలో వాటినే చూపిస్తాన‌ని అన్నారు. 

More Telugu News