suicide: బంధువే మోసగించాడు... ఇద్ద‌రు బలయ్యారు... తొమ్మిది మంది జైలు పాలయ్యారు!

  • మ‌రోసారి తెర మీద‌కి న‌కిలీ వీసాల ఘాతుకం
  • తండ్రీకూతుళ్ల మ‌ర‌ణం వెన‌క పెద్ద క‌థ‌
  • మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య‌

న‌కిలీ వీసాల మోసానికి బ‌లైన అమాయ‌కులు శిరీష‌, ఆమె తండ్రి సూర్య‌నారాయ‌ణ‌ల ఆత్మ‌హ‌త్య వెన‌క శిరీష భ‌ర్త త‌ర‌ఫు బంధువు చేసిన పెద్ద మోసం దాగుంది. ఈ మోసం కార‌ణంగానే వీరితో పాటు మ‌రో తొమ్మిది మంది నిర్దోషులను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయావారిపాలెంకు చెందిన శిరీషకు బంధువైన కిశోర్‌ ముంబైలో ఓ హోటల్‌లో సీఈవోగా పని చేశాడు. త‌ర్వాత ఇట‌లీలో హోట‌ల్ పెడితే డబ్బులు బాగా వ‌స్తాయ‌ని, అందుకు పెట్టుబ‌డి కావాల‌ని శిరీష దంప‌తుల‌ను అడిగాడు. తెలిసిన‌వాడు కావ‌డంతో శిరీష రూ.50 లక్షల వరకు అప్పు తెచ్చి కిశోర్‌కు ఇచ్చింది. త‌ర్వాత కొన్ని రోజుల‌కు ఇటలీలో హోటల్ పెట్టాన‌ని, ఉద్యోగుల‌ను నియ‌మించుకోవ‌డానికి డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌ని, భార‌త ఉద్యోగులైతే బాగుంటుంద‌ని కిశోర్‌ చెప్పాడు.

దీంతో శిరీష తనకు తెలిసిన వారందరికీ ఇటలీలో హోటల్‌లో ఉద్యోగం ఉందని చెప్పి, 9 మంది వద్ద 2 నుంచి 3 లక్షలు వరకు తీసుకొని కిశోర్‌కు పంపింది. కిశోర్‌ వారందరికీ వీసాలు పంపించాడు. ఈ తొమ్మిది వీసాలు ప‌ట్టుకుని, ఇటలీకి వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. అయితే వారి వీసాల‌న్నీ న‌కిలీవ‌ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలు పంపిందెవరు? నేరుగా కిశోర్‌ పంపించాడా? లేక... ముంబైలోని ఏజన్సీ ఈ మోసం చేసిందా? అనే విష‌యాల‌ను ప్ర‌స్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈలోగా తాను మోసపోయాన‌ని గుర్తించిన శిరీష విష‌యాన్ని తండ్రికి చెప్పింది. త‌న‌కు ఆత్మ‌హ‌త్యే శరణ్యమని చెప్ప‌డంతో కూతురు బాధ చూడ‌లేక సూర్య‌నారాయ‌ణ కూడా చ‌నిపోవాల‌ని అనుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసే ఉరి వేసుకున్నారు. ఆ తొమ్మిది మంది తిరిగి వ‌స్తే గానీ పూర్తి వివరాలు తెలియవని స్థానిక పోలీసులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News