gurmeet: గుర్మీత్ ఆశ్రమంలో తవ్వేకొద్దీ అస్థి పంజరాలు... ఇప్పటివరకూ 600 వెలికితీత

  • ప్రతి సమాధిపైనా ఓ మొక్కను నాటించిన గుర్మీత్
  • కొన్ని వృక్షాలుగా ఎదిగాయని చెప్పిన సిట్ అధికారులు
  • మృతదేహాల డీఎన్ఏను సేకరిస్తున్నామన్న సిట్
  • ఎంతో మందిని చంపించాడని గుర్మీత్ పై ఆరోపణలు

సిర్సా శివార్లలో డేరా సచ్చా సౌధా పేరిట ఎన్నో అకృత్యాలు నడిపి, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ పాపపు పనుల చిట్టా రోజురోజుకూ పెరుగుతోంది. డేరా ప్రధాన కార్యాలయంలో ఇప్పటివరకూ 600కు పైగా అస్థి పంజరాలు లభ్యం అయినట్టు సోదాలు నిర్వహిస్తున్న సిట్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇవన్నీ డేరా పరిధిలోనే ఉన్నాయని, ప్రతి సమాధిపైనా ఓ మొక్కను నాటారని, కొన్ని మొక్కులు ఇప్పుడు వృక్షాలుగా కూడా మారాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలు ఎవరివన్న కోణంలో విచారిస్తున్నామని, ఈ ప్రాంతంలో డేరాకు వెళ్లి కనిపించకుండా మాయమైపోయిన వారి వివరాలు సేకరిస్తున్నామని, ప్రతి అస్థి పంజరం డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు.

 కాగా, డేరాకు వచ్చే గుర్మీత్ భక్తులు తాము మరణిస్తే, మోక్షం కోసం ఈ ప్రాంతంలోనే ఖననం చేయాలని కోరుతుంటారని, ఆ కారణంగానే వారిని ఇక్కడే సమాధి చేశామని కొందరు డేరా ప్రతినిధులు వాదించిన సంగతి తెలిసిందే. తనకు ఎదురు తిరిగిన వారిని హత్య చేసి ఇక్కడే పూడ్చి పెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్మీత్ పై పలు ఆరోపణలూ వస్తున్నాయి. కాగా, విచారణలో భాగంగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు జాతీయ మీడియా సమక్షంలోనే కొన్ని అస్థి పంజరాలను వెలికి తీశారు. డేరా హెడ్ క్వార్టర్స్ లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

More Telugu News