RIL: ట్రాయ్ తాజా నిర్ణయంతో దూసుకెళ్లిన రిలయన్స్ ఈక్విటీ విలువ

  • ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను భారీగా తగ్గించిన ట్రాయ్
  • రిలయన్స్ ఈక్విటీకి ఒక్కసారిగా పెరిగిన మద్దతు
  • 4 శాతానికి పైగా లాభపడ్డ ఈక్విటీ విలువ
  • ఆపై అమ్మకాల ఒత్తిడితో కాస్తంత దిగువకు

టెలికం కంపెనీల మధ్య ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను కనిష్ఠస్థాయికి తీసుకువస్తూ టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకున్న నిర్ణయం, మిగతా టెల్కోలకన్నా, రిలయన్స్ పై పాజిటివ్ ప్రభావాన్ని చూపింది. ఇప్పటికే 4జీ సేవలతో దూసుకెళుతున్న జియోకు, ఇంటర్ కనెక్ట్ చార్జీల కోతతో భారీ ఎత్తున ఆదాయం మిగులుతుందన్న అంచనాలు, ఆ సంస్థ ఈక్విటీని ఆకాశానికి లేపాయి. ప్రస్తుతం 14 పైసలుగా ఉన్న చార్జీని 6 పైసలకు తగ్గిస్తూ, ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని ట్రాయ్ వెల్లడించగా, ఆర్ఐఎల్ ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు పోటెత్తారు.

దీంతో ఈ ఉదయం స్టాక్ మార్కెట్ సెషన్ ప్రారంభమైన తరువాత ఆర్ఐఎల్ ఈక్విటీ విలువ ఏకంగా 4 శాతానికి పైగా లాభపడింది. ఓ దశలో రిలయన్స్ ఈక్విటీ విలువ రూ. 872కు దూసుకెళ్లింది. ఆపై స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరుగగా, రిలయన్స్ కూడా కాస్తంత దిగివచ్చింది. మధ్యాహ్నం సమయంలో ఆర్ఐఎల్ విలువ రూ. 848 వద్ద ఉంది.

ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 0.71 పాయింట్ల నామమాత్రపు పతనంతో 32,401 పాయింట్ల వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 4.45 పాయింట్లు పడిపోయి 10,143 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, ఐటీసీ, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, బీపీసీఎల్, టాటా మోటార్స్, హీరో మోటో, కోల్ ఇండియా తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

More Telugu News