sri lanka: వెస్టిండీస్ ఓడిపోగా గట్టునపడ్డ శ్రీలంక... అభిమానులు హ్యాపీ!

వరల్డ్ కప్ కు డైరెక్టుగా అర్హత సాధించిన శ్రీలంక

వెస్టిండీస్ క్వాలిఫయ్యింగ్ పోటీల్లో గెలిస్తేనే చాన్స్

ఇంగ్లండ్ తో జరిగిన వన్డే పోరులో వెస్టిండీస్ ఓడిపోవడంతో, తదుపరి వరల్డ్ కప్ కు శ్రీలంక డైరెక్ట్ గా అర్హత సాధించింది. ఇటీవలి భారత పర్యటనలో చావుదెబ్బ తిని, చిన్న దేశాలతో క్వాలిఫయ్యింగ్ టోర్నీ ఆడి సత్తా చాటితేనే వరల్డ్ కప్ కు చాన్స్ ఉండే స్థితికి లంక క్రికెట్ టీమ్ దిగజారగా, తాజా వెస్టిండీస్ ఓటమి లంకకు లాభించింది. ఈ నెల 30వ తేదీలోగా వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-8 స్థానాల్లో ఉండే జట్లు వరల్డ్ కప్ కు డైరెక్ట్ గా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే.

ఇక ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఓడిపోగా, గడువు లోగా, టాప్-8 స్థానాల్లో నిలిచే అవకాశం ఆ జట్టుకిక లేదు. వెస్టిండీస్ 9వ స్థానానికి దిగజారగా, శ్రీలంక ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని 8వ ర్యాంకులో నిలిచింది. ప్రస్తుతం శ్రీలంకకు 86 పాయింట్లు ఉండగా, వెస్టిండీస్ 78 పాయింట్లతో ఉంది. మరో పది రోజుల్లో గడువు ముగియనుండగా, శ్రీలంక మరే మ్యాచ్ లూ ఈలోగా ఆడబోవటం లేదు.

ఇదే సమయంలో వెస్టిండీస్ ఒక మ్యాచ్ ని ఆడనుండగా, అది గెలిచినా, పాయింట్ల విషయంలో శ్రీలంకను దాటే అవకాశాలు లేవు. ఇక వెస్టిండీస్ జట్టు వచ్చే సంవత్సరం జరిగే క్వాలిఫయ్యింగ్ టోర్నీలు ఆడి, టాప్-2లో నిలిస్తేనే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. తమ దేశం క్వాలిఫయ్యింగ్ టోర్నీ ఆడాల్సి వస్తే, పరువు పోయినట్టేనని భావిస్తున్న లంక క్రికెట్ అభిమానులు, ఇప్పుడా అవసరం తప్పడంతో ఆనందంగా ఉన్నారు.

More Telugu News