gujarat assembly elections: గుజరాత్ ఎన్నికల్లో 'ఆప్' పైన ఆశలు పెట్టుకున్న బీజేపీ!

  • గుజరాత్ లో బీజేపీకి ఎదురుగాలి
  • సంఘ పరివార్ సర్వేలో తేలిన వాస్తవం
  • అలర్టైన మోదీ, అమిత్ షా
  • అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఆప్
  • మహాకూటమి ఏర్పడితే బీజేపీకి షాకే

దాదాపు రెండు దశాబ్దాల నుంచి గుజరాత్ లో బీజేపీ అధికారమే నడుస్తోంది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డిసెంబర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయం జెండాకు ఎదురు గాలి వీచే అవకాశాలున్నాయి. సాక్షాత్తు సంఘ్ పరివార్ చేసిన సర్వేలో విస్తుగొలిపే ఈ వాస్తవం వెలుగు చూసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే బీజేపీకి కేవలం 52 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయని సంఘ్ నిగ్గుతేల్చింది. ఈ సర్వే ఫలితాలతో గుజరాత్ కే చెందిన ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు షాక్ కు గురయ్యారు. దీంతో, వారు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు.

ఈ క్రమంలోనే హుటాహుటిన జపాన్ ప్రధాని అబేని గుజరాత్ కు పిలిపించడం, బుల్లెట్ ట్రైన్ కు శంకుస్థాపన చేయించడం, సర్దార్ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించడం లాంటివి చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 31 జిల్లా పంచాయతీలకు గాను 23 స్థానాలను, 193 తాలూకా పంచాయతీలలో 113 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే... అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. 20కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 5వేల కంటే తక్కువ మెజార్టీతోనే గెలుస్తారని చెబుతున్నారు.

రెండు దశాబ్దాల బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి విజయావకాశాలను దూరం చేస్తోంది. దీనికి తోడు, పటేళ్ల రిజర్వేషన్ల అంశం ప్రతిబంధకంగా మారింది. అల్పేష్ ఠాకూర్ నాయకత్వంలోని 'ఓబీసీ ఏక్తా మంచ్' కూడా బీజేపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీనికి తోడు గోరక్షుల పేరిట జరిగిన దాడుల వల్ల దాదాపు 9 శాతం మంది దళిత ఓటర్లు కమలం పార్టీకి దూరమైనట్టు అంచనా వేస్తున్నారు. మెజారిటీ ముస్లింలు కూడా ఈ సారి కాంగ్రెస్ కే ఓట్లు వేసే అవకాశం కనిపిస్తోంది. దీనికితోడు ఆనందిబెన్ పటేల్, విజయ్ రూపాని హయాంలో వెలుగు చూసిన కుంభకోణాలు బీజేపీకి మచ్చ తెచ్చాయి.

ఈ తరుణంలో, రానున్న ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, ఆ పార్టీపై బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఆప్ బరిలోకి దిగితే.. ప్రజా వ్యతిరేకత విపక్ష పార్టీల మధ్య చీలిపోతుందని... అంతిమంగా ఇది బీజేపీకి లాభం చేకూరుస్తుందని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. అయితే, కాంగ్రెస్, ఎన్సీపీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు మహాకూటమిగా ఏర్పడితే మాత్రం... బీజేపీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News