anshu mishra: రూపాయి ఖ‌ర్చు పెట్ట‌కుండా 24 రాష్ట్రాలు, 4 కేంద్ర‌పాలిత ప్రాంతాలు తిరిగిన వ్య‌క్తి

  • గుళ్లు, గురుద్వారాల్లో మ‌కాం
  • లిఫ్ట్‌లు అడుగుతూ ప్రయాణం
  • మూడు దేశాల స‌రిహ‌ద్దులు దాటిన వైనం

అల‌హాబాద్‌కు చెందిన 28 ఏళ్ల అన్షూ మిశ్రా ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌కుండా దేశంలోని 24 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు సంద‌ర్శించాడు. 225 రోజుల త‌న రోడ్డు ప్ర‌యాణంలో కేవ‌లం వాహనాల‌ను లిఫ్ట్ అడ‌గ‌డం ద్వారా మాత్ర‌మే ప్రయాణించిన‌ట్లు అన్షూ చెప్పాడు. అలాగే నివాసం, ఆహారం కోసం గుళ్లు, గురుద్వారాల‌ను ఆశ్ర‌యించేవాడినని తెలిపాడు. త‌న ప్ర‌యాణంలో చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని, డ‌బ్బులు లేకుండా ప్ర‌యాణం చేయ‌డంలో చాలా ఇబ్బందులు ఎదుర్కున్న‌ట్లు అన్షూ వివ‌రించాడు.

`ఈ ప్ర‌యాణం అంత సుల‌భంగా సాగ‌దు. కొన్ని సార్లు ప్ర‌జ‌లు మ‌న వైపు చాలా అనుమానంగా చూస్తారు. మాన‌వ‌త్వం ఉన్న కొంత‌మంది మాత్ర‌మే స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌స్తారు` అన్నాడు. త‌న ప్ర‌యాణంలో ఒక‌సారి 48 గంట‌ల పాటు ప‌స్తులు ఉండాల్సి వ‌చ్చిందని, అలాగే ఒక‌సారి దాదాపు 9 గంట‌ల పాటు లిఫ్ట్ ఇచ్చేవారి కోసం ఎదురు చూడాల్సి వ‌చ్చిన విష‌యాల‌ను తెలియ‌జేశాడు. త‌న ప్ర‌యాణానికి సంబంధించిన వివరాల‌ను చెప్ప‌డం ద్వారా ప్ర‌జ‌ల నుంచి సాయాన్ని ఆశించే వాడిన‌ని, అంతే త‌ప్ప భిక్షాట‌న చేసేవాడిని కాద‌ని అన్షూ చెప్పాడు. భూటాన్‌, మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల‌ను దాటి వెళ్లాన‌ని, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దు ద‌రిదాపుల‌కు కూడా వెళ్లిన‌ట్లు పేర్కొన్నాడు.

More Telugu News