గోవు: విదేశీ గో'మాత': టూరిస్ట్ గా భార‌త్‌కి వచ్చి.. 1200 గోవుల‌ను సాకుతున్న జర్మనీ మహిళ!

  • జ‌ర్మ‌నీకి చెందిన ఫ్రైడెరిక్ ఇరినా బ్రూనింగ్ 
  • గోసేవ పుస్త‌కాల‌ను చ‌దివి హిందీ సైతం నేర్చుకున్న మహిళ 
  • గోశాల కోసం నెల‌కు 22 ల‌క్ష‌ల రూపాయల ఖ‌ర్చు  
  • బెర్లిన్‌లోని తన ప్రాప‌ర్టీ మీద వచ్చే డబ్బుతో గోసేవకు ఖర్చు

జ‌ర్మ‌నీకి చెందిన ఫ్రైడెరిక్ ఇరినా బ్రూనింగ్ (59) 1978లో భార‌త్‌లోని ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను చూడాల‌ని వ‌చ్చింది. అయితే, ఆమె అప్ప‌టి నుంచి భార‌త్‌లోనే ఉంటూ గోసేవ చేస్తోంది. ఇప్పుడు ఆమె వ‌ద్ద 1200 ఆవులు ఉన్నాయి. వాటికి వైద్యం చేయిస్తూ ఆహారం అందిస్తూ కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ వ‌స్తోంది. టూరిస్ట్‌గా భార‌త్‌లో అడుగుపెట్టే వ‌ర‌కు ఆమెకు ఏ ల‌క్ష్య‌మూ లేదు. కానీ, భార‌త్‌కి వ‌చ్చిన త‌రువాత గోవుల‌ను సంర‌క్షించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. భార‌త్‌లోకి వ‌చ్చాక తాను జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక గురువు అవ‌స‌ర‌మ‌ని తెలుసుకున్నాన‌ని, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మ‌ధుర‌లోని రాధేకండ్ లో త‌న‌కు ఓ గురువు దొరికింద‌ని ఆమె తెలిపారు.

త‌న గురువు నుంచి స్ఫూర్తి పొంది అప్ప‌ట్లో ఒక ఆవును ద‌త్త‌త తీసుకున్నట్లు చెప్పారు. భార‌త్‌లో ల‌భ్య‌మ‌వుతోన్న గోసేవ పుస్త‌కాల‌ను అధికంగా చ‌దివాన‌ని, ఆ పుస్త‌కాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల తాను హిందీ కూడా నేర్చుకున్నాన‌ని తెలిపారు. ఎంతోమంది రైతులు తాము పెంచుకున్న ఆవులు వృద్ధాప్యంలోకి రాగానే లేక‌పోతే వాటికి ఏదైనా వ్యాధి సోకితే వాటిని ఇక పెంచుకోకుండా వ‌దిలేసేవార‌ని ఆమె చెప్పారు. ఆ ఆవుల‌న్నింటినీ తాను తీసుకుని సుర్భాయి గోసేవ నికేత‌న్ పేరుతో ఓ గోశాల‌ను నెల‌కొల్పి అందులో పెంచుకుంటున్నాన‌ని తెలిపారు.

అవి తన పిల్ల‌ల్లాంటివేన‌ని వాటిని వ‌దిలి తాను ఉండ‌లేన‌ని ఆమె పేర్కొంది. ప్ర‌స్తుతం త‌న ద‌గ్గ‌ర గోవులు, దూడ‌లు క‌లిపి మొత్తం 1200 ఉన్నాయ‌ని చెప్పారు. రాధేకండ్ లో ఉన్న త‌న‌ గోశాల 3300 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ఉందని, ఆవుల సంఖ్య పెరిగిపోతుండ‌డంతో ఆ స్థ‌లం స‌రిపోవ‌డం లేద‌ని తెలిపారు. వ్యాధితో బాధ‌ప‌డుతోన్న గోవుల‌ను త‌న గోశాల బ‌య‌ట కొంద‌రు వదిలి వెళ‌తార‌ని ఆమె అన్నారు. 1200 ఆవుల సంర‌క్ష‌ణ‌ను చూసుకునేందుకు 60 మంది ప‌నివారిని పెట్టుకున్నాన‌ని తెలిపారు.

గోవులకు వైద్యం, మేత‌, ప‌ని వారికి ఇచ్చే జీతం మొత్తం క‌లిపి నెల‌కు 22 ల‌క్ష‌ల రూపాయల ఖ‌ర్చు అవుతుంద‌ని చెప్పారు. ఇంత డ‌బ్బు ఆమెకు ఎలా స‌మ‌కూరుతుందని అడ‌గ‌గా, అందుకు స‌మాధానం చెబుతూ... బెర్లిన్‌లో తనకు ప్రాప‌ర్టీ ఉంద‌ని, దాన్ని అద్దెకు ఇచ్చాన‌ని, అక్క‌డి నుంచి వ‌చ్చే డ‌బ్బుతో గోశాల‌ను నిర్వ‌హిస్తున్నాన‌ని తెలిపారు. త‌న తండ్రిని చూడ‌డానికి ఏడాదికి ఓ సారి బెర్లిన్ వెళుతుంటాన‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం బాగోలేద‌ని చెప్పారు.

త‌న‌కు బెర్లిన్ నుంచి ఆదాయం వ‌స్తోన్న నేప‌థ్యంలో భార‌త పౌరసత్వం పొందలేకపోతున్నానని, తనకు శాశ్వ‌త వీసా దొర‌క‌డం లేద‌ని, ప్ర‌స్తుతం త‌న ముందు ఉన్న స‌మ‌స్య అదేన‌ని అన్నారు. త‌న వీసాను ఏడాదికి ఓ సారి రెన్యూవ‌ల్ చేయించుకోవాల్సి వ‌స్తోంద‌ని చెప్పారు. ఆమెను స్థానికులు సుదేవీ మాతాజీ అని పిలుచుకుంటారు.

More Telugu News